ర్యాగింగ్ వాస్తవం..నిందితులు సురక్షితం..

ర్యాగింగ్ వాస్తవం..నిందితులు సురక్షితం..
గుంటూరు) రిషితేశ్వరి మరణానికి సంబంధించి ప్రభుత్వం దాగుడు మూతలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. పత్రికల్లో వస్తున్న వార్తలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్పందించింది. నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, చీఫ్ వార్డెన్ స్వరూపా రాణిలు హాజరయ్యారు. రిషితేశ్వరి మరణానికి సంబంధించిన వివరాల్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 
నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ జరుగుతున్న మాట వాస్తవమే అని చీఫ్ వార్డెన్ స్వరూపా రాణి అంగీకరించారు. గతంలో కూడా ఒక విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకొన్నామని వివరించారు. అప్పట్లో ఐదుగురు విద్యార్థినులను ఇంటికి పంపించ వేశామని చెప్పారు. 
వాస్తవానికి గత నెల 30నే చీఫ్ వార్డెన్ పదవికి స్వరూపా రాణి రాజీనామా చేసినట్లు సమాచారం. రిషితేశ్వరి ఆత్మహత్య, తదనంతర పరిస్థితుల మీద వచ్చిన వార్తలతో కలత చెంది ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఈ కేసు విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
మరో వైపు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆయనకు ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు యూనివర్శిటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
Back to Top