కళ్లకు గంతలు కట్టే బాబొస్తున్నాడు...జరభద్రం

 
వేలు చూపిస్తే హస్తం మింగేస్తాడు...ఇది చంద్రబాబుకు మోస్ట్‌ సూటబుల్‌ సేయింగ్‌. ఆయనగారి పార్టీ ఇయర్స్‌ కెరీరంతా ఇలాగే సాగుతూ వుంది. ఆ విధంగా...ఆయన ముందుకు పోతూనే వున్నారు. కిందపడ్డా నాదే పైచెయ్యి అంటాడు. ఇక పై చెయ్యి ఆయనదే అయితే చెప్పాల్సిన పనేలేదు.
1978లో తొలిసారి ఎమ్మెల్యే కాగానే, అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యగారి పుణ్యమా అని మంత్రయిపోయారు. పాపం అందరిలానే తండ్రి మనసుతో...కూతురికి మంత్రిగారి సంబంధం మంచిదనుకుని...బిడ్డ నిచ్చి పెళ్లి చేశారు ఎన్టీయార్‌. ఇక అప్పట్నుంచి ఆయన పాలిట చంద్రబాబు జామాత దశమగ్రహం. ఆ గ్రహచారం వెన్నుపోటుదాకా దారితీసింది. మామను గద్దె దించి మరీ ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు అల్లుడు బాబు. ఇక రాజకీయాలు బాబు ముందు...బాబు తర్వాత అన్నంతగా దిక్కుమాలిన చంద్ర చరిత్రకు దారితీశాయి. కులాల కుంపట్లు రాజుకున్నాయి. స్వంత సామాజిక వర్గం వ్యాపారవేత్తలు, మీడియా పెద్దలు అందరూ కలిసి, తలో చెయ్యి వేసి...బాబుగారిని నిలబెడుతుంటే...కల్పవృక్షంలా కనిపించిన ఆంధ్రప్రదేశ్‌ను కబళించడం మొదలయింది. రాజకీయనాయకులు బిజినెస్‌ టైకూన్ల మాదిరి మారిపోయారు. బిజినెస్‌ టైకూన్లు రాజకీయనాయకులైపోయారు. పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా కల్తీపాలన పటిష్టమైపోయింది. బినామీ రూపాల్లోని అస్మదీయులు అరివీరభయంకరులుగా అవతరించారు. మద్యం మాఫియా, ఇసుకబకాసురులు, భూదోపిడీ దారులు, దోచుకోవడానికే పుట్టినట్టుగా ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు...ఇలా ఏకంగా గుడిని, గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు ’పచ్చ’బాబులు తయారయి కూర్చున్నారు. ఇప్పటికిప్పటికి కళ్లు తెరిచినా కనిపించే చేదునిజమిది. ఎపి ప్రజల శాపమిది.
పైన చెప్పుకున్నట్టు బాబుగారు, బాబుగారి వర్గమంటూ ఒకటి తయారయిపోయింది. తెగ బలిసిపోయింది. కానీ వీళ్లదగ్గర వున్న గొప్ప లక్షణమేమిటంటే...బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నా కనిపించనీయరు. ఎదుటి వారి చెవుల్లో పెట్టడానికి పూలు చేతిలో పెట్టుకుని తిరుగుతూనే వుంటారు. పూలే కనిపిస్తాయి. కత్తి కనిపించదు. పాపం, ఆ కత్తిపోట్లు ప్రజలకెన్నెన్నో....ఎలా బరిస్తున్నారో పాపం. వీరి బారిన పడ్డ ప్రజల బాధ వర్ణనాతీతం.
సరే, మళ్లి వెనక్కు వెళితే, ఎన్టీయార్‌ను దింపేశాక, ఆయన్ను మరిపించడానికి బాబుగారు వేసిన జిత్తులు అన్నీ ఇన్నీ కావు. తను చేసిన దుర్మార్గానికి సమర్ధించుకోవడానికీ ... ఎన్టీయార్‌గారు మనస్పూర్తిగా అర్ధాంగిగా స్వీకరించిన లక్ష్మీపార్వతిగారిని బూచిగా చూపాడు. నానా యాగీ చేశాడు. పార్టీని నిలబెట్టడానికి, ఎన్టీయార్‌ పేరును కీర్తిశేషుడిగా మార్చడానికే ఇదంతా చేశాడు. ఆయన మనసులో లక్ష్యం నెరవేరింది. పాపం, అల్లుడుగారి దెబ్బకు మానసికంగా కృంగి, కృశించిన ఎన్టీయార్‌ ఇక సెలవంటూ శాశ్వతంగా లోకాన్ని వీడిపోయారు. ఆయన ఢిల్లీ లెవెల్లో కూడగట్టిన పేరు, జాతీయనాయకుల స్నేహం అన్నీ బాబుగారికి కలిసివచ్చాయి. ఆ ...అంటే ప్రధానిని కమ్మన్నా వద్దన్నాను అంటూ బాబు డబ్బాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆయన్ను నేను ప్రధానిని చేశాను...ఈయన్ను నేనే రాష్ట్రపతిని చేశాను అంటూ మొహమాటమంటూ లేకుండా చెప్పుకోవడం మొదలుపెట్టారు. పాపం, ఆ పదవులకు ఎక్కిన వారికి ఆ స్థాయి లేనట్టు, అంతా తన భిక్షే  అన్నట్టు గొప్పలు చెప్పుకున్నారు. ఆ విధంగా బాబుగారు, రాజకీయాలు నడుపుతుంటే...విశాల ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతో కునారిల్లిపోయింది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడింది. కరెంటు బిల్లులు షాకులు, బ్యాంకుల దబాయింపులు...ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రజలు పొలాల్లోకి పారిపోయే పరిస్థితి కల్పించాయి. కరెంటుపై ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్చిన ఘన చరిత్ర బాబుగారిది. అలా చేస్తూ పోయిన చంద్రబాబుగారి పాపం పండింది. వైయస్సార్‌ ప్రజలకు భరోసాగా నిలిచారు. ధైర్యమై నడిచారు. బాబును 2004లో గద్దె దింపారు. వైయస్సార్‌ ఐదేళ్ల ప్రజాపాలన సువర్ణయుగమని తలచేలా నిలిచింది. ప్రతి పేదవాడి సమస్యను అడ్రస్‌ చేసిన పథకాలు ఆయనవి. ఉచితవిద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇళ్లు, ప్రాజెక్టులు ఇలా ఒకటేమిటి...అటు సంక్షేమపథకాలను అందిస్తూనే, ఇటు అభివృద్దిని పరుగులు పెట్టించారు వైయస్సార్‌. 2009లోనూ బాబుగారిని ప్రతిపక్షానికే పరిమితం చేశారు వైయస్సార్‌గారు. ప్రజల దురదృష్టం ...ఆయన మరణం. ఇక అప్పట్నుంచి రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. విభజనా జరిగింది. 
సీనియర్‌ చంద్రబాబు 600వందల హామీలతో, రుణమాఫీ మాయాజాలంతో ప్రజలను మాయచేశారు. నమ్మించారు. అంత చేసినా, కిందామీద పడి గెలిచారు. ఆ గెలుపు సందర్భంలోనూ అటు బిజెపీ, ఇటు పవన్‌కళ్యాణ్‌ భుజాల మీద చేతులేసి నడిచారు. అలాంటి పెద్దమనిషి  నాలుగున్నరేళ్ల పాలనలోని వైఫల్యాలు, దుర్మార్గాలు, దోపిడీ పర్వాలు, కనిపించని అభివృద్ది, అటకెక్కిన సంక్షేమ పథకాలు...ఇలా ఒక్కటేమిటి...అన్నింటి దెబ్బకు ఎపి ఇప్పుడు చీకటిమయమైంది. గ్రహణం పట్టిన జాతిగా మిగిలింది. ఈ నిజం తెలియని వారుంటే...కళ్లుండి చూడలేని గుడ్డివాళ్లయినా అయివుండాలి. పచ్చకౌరవసంతతి ప్రేమికులైనా అయివుండాలి. 
మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండే సరికి టక్కుటమారాది విద్యల ప్రదర్శనకు తెరలేపారు బాబు. 

ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సారి ఎపి ప్రజలు కళ్లు తెరిచి, నిజం తెలిసి...మార్పును తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. మరి వారిపై మాయతెరలు ఎంతగా కప్పుతారో బాబుగారు. పీపుల్‌ ఆఫ్‌ ఎ.పి బివేర్‌ ఆఫ్‌ బాబు.....
Back to Top