దత్తత గ్రామంలోనూ దరిద్రమే

– పెదలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు
– అక్టోబర్‌ 2015లో ప్రకటించిన ముఖ్యమంత్రి 
– పదహారు నెలలు గడిచినా అదే దుస్థితి..
– మాటల్లోనే స్మార్ట్‌ విలేజ్‌.. చేతల్లో వేస్ట్‌ 
– సీఎంగా అధికారం ఉన్నా కనిపించని సంక్షేమం
– గుర్తుకొస్తున్న వైయస్‌ఆర్‌ ‘పిన్నికి బంగారు గాజులు’ సామెత 

‘అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తాం.. అమరావతికి దావోస్‌ను రప్పిస్తా.. విజయవాడను ఐటీ హబ్‌గా మారుస్తా.. ప్రపంచశ్రేణి నగరాల్లో అమరావతికి మొదటి స్థానం కల్పిస్తా.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఎయిర్‌పోర్టు నిర్మిస్తా.. రాష్ట్రం నుంచి కరువును పారదోలేదాకా నిద్రపోను.. జిల్లాకో ఎయిర్‌పోర్టు కట్టిస్తా.. బందరు పోర్టును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేస్తా.. నా చివరి రక్తపు బొట్టు వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడతా..’ పరిచయం అక్కర్లేని ఈ ప్రగల్భాలు ఎవరి నోటి నుంచి వచ్చాయో బహుశా తెలుగు వారెవరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు.  మీరు ఊహించిన పేరే.. శ్రీమాన్‌ నారా వారు. ప్రపంచ శ్రేణి మాటలు చెప్పుకు బతికే చంద్రబాబుకు.. చేస్తున్న పనులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 

చంద్రబాబును వైయస్‌ఆర్‌ అందుకే అలా అనేవారు..
మాటలమ్ముకు బతికే బాబుకు చెప్పిన మాటలు.. చేసిన హామీలు ఏమాత్రం గుర్తుండటం లేదు. గతంలో వైయస్‌ఆర్‌ పలుమార్లు చంద్రబాబును ఉద్దేశించి ఒక మాటనేవారు.. ‘అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట.’ ఈ సామెత అప్పట్లో ఎంత ఫేమస్సో ప్రతి తెలుగువాడికీ తెలుసు. అది కూడా వైయస్‌ఆర్‌ నోటి నుంచి వింటుంటే ఆయన అభిమానుల్లో అదో రకమైన ఉత్సాహం. ఆయన చంద్రబాబు గురించి ఏదో అలవోకగా వాడినది మాత్రం కాదు. చంద్రబాబు గురించి దశాబ్దాలుగా తెలిసిన వైయస్‌ఆర్‌.. చంద్రబాబును ఎప్పుడు విమర్శించాల్సి వచ్చినా ఈవిధంగా చమత్కారంగా అనేవారు. వాస్తవానికి ఇది తిట్టు కాకపోయినా చంద్రబాబులా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మాత్రం తల వంచుకు తీరాల్సిన కఠిన వాస్తవం. వైయస్‌ఆర్‌ అన్న ఆ మాటను చంద్రబాబు సీరియస్‌గా తీసుకుని ఉంటే మనం ఇప్పుడు ఈ స్టోరీ చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. 

దత్తత ఊరికే దారి చూపలేనోడు..  
దేశం మొత్తం మీద ఎప్పుడు ఏ ట్రెండ్‌ నడిస్తే దానికి తానే ఆద్యుడినని చెప్పుకునే బాబు తాను దత్తత తీసుకున్న ఊరి బాగోగులు పూర్తిగా మరిచి పోయారు. ఒక సీఎంగా అధికారం చేతిలో ఉండి కూడా దత్తత గ్రామానికి కనీసం వసతులు కల్పించడానికి కూడా చంద్రబాబు చేతకాని అసమర్థుడయ్యాడు. దేశం మొత్తం నరేంద్రమోడీ పిలుపుతో గ్రామాలను దత్తత తీసుకుంటుంటే బాబు కూడా పనిలో పనిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. పచ్చ పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలొచ్చాయి. గ్రామస్తులు కూడా తమ జీవితాలు బాగుపడతాయని సంబర పడ్డారు. ఇప్పటికే ఏడాది దాటిపోయింది. అయినా వారి జీవితాల్లో రవ్వంత మార్పు కూడా కనిపించలేదంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబును ఏమనాలి..? ఉన్నతాశయంతో దత్తత తీసుకున్న ఊరికే మేలు చేయలేని వాడు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడని అక్కడి ప్రజలు బాబును దుమ్మెత్తి పోస్తున్నారు. దత్తత తీసుకున్న ఊరికే దారి చూపలేనోడు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడని బాబు పాలనను ఛీ కొడుతున్నారు. 

పస్తులుంటున్న పెదలబుడు ప్రజలు
ఆకు పచ్చని అరకు కొండల మధ్య విసిరేసినట్టున్న పంచాయితీ పెదలబుడు. అక్కడికి వెళ్లడానికి సరైన దారి లేదు. ఇక్కడ ఎక్కువ శాతం ఆదివాసీలే. కాయకష్టం చేసి బతుకుతుంటారు. పొలం పనులు దొరికితే తింటారు. లేదంటే పస్తులే. సరైన విద్య, వైద్య సౌకర్యాలు లేవు. తాగునీటి వసతి అంతంత మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో 2015 అక్టోబర్‌లో ఈ గ్రామస్తులకు ఒక తీపి కబురు అందింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈ గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే దానికి కారణం. 

దత్తత ఈ గ్రామంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
ప్రజలు ఎలా బతుకుతున్నారు? గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుంది. కనీస వసతులు కల్పించారా..? మొదలైన అంశాలను పరిశీలిస్తే పెదలబుడు గిరిజనుల జీవితాలు ఏమాత్రం మారలేదని తెలుస్తోంది. 
అరకు నుండి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న పెదలబుడు పంచాయితీలో 21 గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 11,280. ( వీరిలో మహిళలు 5,150, గిరిజనులు 8,758, ఎస్సీలు 208, ఇతరులు 2,314.)
ఒక్క ఆరోగ్య కేంద్రం కూడా లేదే..?
పదకొండు వేల జనాభా ఉన్న ఈ పంచాయితీలో ఒక్క ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కూడా కనబడదు. ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మాత్రమే ఉంది. అక్కడ అన్ని రోగాలకు పరిష్కారం ఉండదు. ప్రజలు రోగాల బారిన పడితే అరకు, లేదా విశాఖకు పొవాల్సిందే.

మూత పడిన బడి..
పెదలబుడు పంచాయితీ పరిధిలోని లిట్టిగూడ గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్‌ ఇటీవల మూతపడింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే సాకుతో ఈ స్కూల్‌లో పాఠాలు చెప్పడం లేదు. దీనివల్ల ఇక్కడ చదువుతున్న 23 మంది విద్యార్థులు 2 కిలో మీటర్లు నడిచి మరో స్కూల్‌కి వెళ్లాల్సిన పరిíస్థితి ఏర్పడింది.

సరైన రహదారులు లేవు..
అరుకు లోయలో కొండల పక్క నుండి అంత దూరం నడవడం చాలా రిస్కు. సరైన రహదారులు లేవు. వానా కాలంలో కాలిబాటలు తెగిపోతాయి. ఈ బాధలు భరించలేక పిల్లలు మధ్యలోనే చదువు అపేసే పరిస్ధితి. తమ బడిని తిరిగి తెరవాలని విద్యార్ధులంతా విశాఖలోని కలెక్టరేట్‌ ముందు ధర్నా కూడా చేశారు కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు. అరకులోని 11 మండలాల్లో పిల్లలు తక్కువ ఉన్నారనే కారణంతో ఇప్పటి వరకు 70 పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో బడిమానేసే పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగి పోతోంది. ముఖ్యమంత్రిగారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన తరువాత కూడా పిల్లలకు చదువు అందుబాటులో లేక పోవడం ఆదివాసీలపై బాబుకున్న శ్రద్ధ ఎలాంటిదో చెబుతోంది. 

తాగునీటికి కటకట
పెదలబుడులో 3,116 కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ రోజూవారీ అవసరాలకు తగినంత నీటిసరఫరా కావడం లేదు. అక్కడక్కడా ఉన్న ఆరు బావుల నీరే ప్రజలకు ఆధారం. కేవలం 119 చేతిపంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని రిపేరులో ఉన్నాయి. ఇక తాగునీరు అంతంత మాత్రమే.

తాగునీటికి ఇలాంటి బావులే ఆధారం
గరడగుడ,గంజాయిగుడ గ్రామాల్లో కొండలమీదున్న ఊటనీటి కుంటలనుండి దిగువకు ప్రవహించే నీరే ఈ ఆదివాసీల దాహార్తి తీరుస్తోంది. గిరిజన మహిళలు ఆ నీళ్లను కుండల్లో నింపి మోసుకుంటే సుదూర తీరంలో ఉన్న ఇళ్లకు నడిచి పోవాల్సిందే. ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా పంచాయితీలో ప్రతీ ఇంటికీ మంచి నీటిని అందించాలనే ప్రతిపాదన ఉంది. కానీ, అదింకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. 

పారిశుధ్యంపై చిత్తశుద్ధి లేదు
పెదలబుడులో అతిపెద్ద సమస్య పారిశుధ్యం. గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది. మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. చినుకు పడితే చిత్తడే. వీధుల్లో నీరు నిలిచి పోతుంది. దీంతో దోమలు పెరిగి గిరిజనులు అంటు వ్యాధులకు లోనవుతున్నారు. ఉపాధి హామీ నిధులతో ఒక చెత్తశుద్ధి కేంద్రం నిర్మించాలనుకున్నారుకానీ, అదింకా పూర్తికాలేదు.

అందరికీ మరుగుదొడ్లు లేనే లేవు
గ్రామంలో మొత్తం 3,116 కుటుంబాలున్నాయి. అందరికీ మరుగుదొడ్లులేవు. ఉపాధి హామీ పథకంలో కొన్ని మంజూరయ్యాయి. కానీ ఇంకా పూర్తి కాలేదు. 1000 మరుగుదొడ్లు అవసరం ఉంది. ఈ ప్రాంతమంతా వర్షాధార పంటలే. సాగు చేయాలంటే బోర్లు కావాలి. ఆ మధ్య ఎన్టీఆర్‌ జలసిరులు అనే పథకం ప్రకటించారు. దానిని గ్రామంలో పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. విత్తనాలు కూడా విత్తునాటే సమయంలో ఇవ్వకుండా సీజన్‌ అయిపోయాక ఇస్తున్నారు. దీని వల్ల రైతులంతా నష్ట పోతున్నారు.

ఖాళీగా తిరుగుతున్న నిరుద్యోగులు 
ఉపాధి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పెదలబుడు నిరుద్యోగులు 
ఉపాధి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పెదలబుడు నిరుద్యోగులు
రహదారులు వేస్తున్నారు కానీ, వాటి పక్కన సైడు కాల్వలు నిర్మించక పోవడం వల్ల వానలు కురిసినపుడు నీరంతా రోడ్ల మీదకు చేరుతోంది. స్కూల్స్‌కి టాయిలెట్లు కడుతున్నారు. కానీ, నీటి సరఫరా లేక అవి నిరుపయోగం అవుతున్నాయి. చాలా మంది ఆడవారు ఇప్పటికీ ఈ ప్రాంతంలో కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. 300 వరకు గ్యాసు కనెక్షన్లు అవసరం ఉంది. 150మంది నిరుద్యోగులు చదువుకొని ఖాళీగా తిరుగుతున్నారు. ఒక్కరికీ ఉద్యోగం దక్కలేదు.

ఆ రూ. 1.90 కోట్లు ఏమైనట్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత గ్రామానికి నిధుల వరద పారుతోందని పచ్చ పత్రికల్లో వార్తలు వెల్లువెత్తాయి.  గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా రూ.1.90 కోట్ల నిధులను విడుదల చేస్తూ జూన్‌ 25, 2016లో ప్రభుత్వం జీవో జారీచేసింది. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ రూ.1.90 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, పంచాయతీ పరిధిలోని అరకు వ్యాలీలో మరో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం మరో రూ.25 లక్షలు, అరకులో ఎడ్యుకేషన్‌ హబ్‌ కోసం రూ.1.40 కోట్లు కేటాయించనున్నారు. 

గాలికొండలో బాక్సైట్‌ నిక్షేపాలు
ఏజన్సీలో ఎన్నో గ్రామాలుండగా.. ఒక్క ఈ టూరిస్టు ప్లేస్‌నే చంద్రబాబు ఎందుకు ఎంపిక చేసుకున్నారు? బాక్సైట్‌ మీద ప్రేమతోనా? అరకుమీద అభిమానంతోనా? అరకు పరిధిలోని చాలా గ్రామాలు కనీస వసతులు లేక అల్లాడుతున్నాయి.. ఏజెన్సీలోని 244 గ్రామ పంచాయితీల్లో 44 గ్రామాలకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు... విషజ్వరాలు, అనారోగ్యాలతో బాధ పడే ఈ ప్రాంత ఆస్పత్రుల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అరకు ఏజెన్సీ గాలికొండలో బాక్సైట్‌ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అటు టీడీపీ ప్రభుత్వం కూడా బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా ఉంది. గిరిజనుల నుంచి ఈ పనులకు వ్యతిరేకత రాకుండా చేసేందుకు సీఎం రంగంలోకి దిగారని తెలుస్తోంది. దత్తత తీసుకుంటే ప్రజల నుంచి మద్దతు వస్తుందని... ఆ తర్వాత మెల్లగా తవ్వకాలు చేపట్టొచ్చని సీఎం ఆలోచిస్తున్నారు. 
Back to Top