తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తూ వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన 'వెన్నుపోటు దినం' విజయవంతం అయ్యిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ 'వెన్నుపోటు దినం'కు పిలుపునిస్తే, అందులో అన్ని వర్గాలు భాగస్వాములయ్యాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొని ఈ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి పలువురు నాయకులను హౌస్ అరెస్ట్‌ల పేరుతో వేధించిందని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... చంద్రబాబు మూడు పార్టీలను కూడగట్టుకుని కూటమి పేరుతో అమలు చేయలేనని ముందే తెలిసినా కూడా పలు హామీలను ప్రజల ముందు పెట్టి, అన్ని శక్తులను కూడగట్టుకుని అధికారంలోకి వచ్చారు. ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయ్యింది. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీనికి నిదర్శనే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్న నిరసన ర్యాలీలు. 2019లో ఇదే పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది. ఆనాడు వైయస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకుంది. తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజల నుంచి వచ్చిన ఈ తాజా నిరనసనలు దేనికి సంకేతమో చంద్రబాబు గుర్తించాలి. ఎప్పుడూ ప్రజలతోనే వైయస్ఆర్‌సీపీ 2019లో వైయస్ జగన్ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు టీడీపీని జనం కూకటివేళ్ళతో సహా పెకిలించివేశారు. ఆ సందర్భంగా దాదాపు రెండుమూడేళ్ళ పాటు ఆ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. అలాగే 2024లో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఓటమితో వైయస్ఆర్‌సీపీ ప్రజలకు ముఖం చాటేయలేదు. ఓటమి నుంచి బయటకు వచ్చి వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడింది. ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల్లో ఉండటం అనేది ఏ రాజకీయ పార్టీకి అయినా ప్రధానమైన ప్రాతిపాదిక. దీనిని వైయస్ఆర్‌సీపీ ఏర్పాటైన నాటి నుంచి తూచా తప్పకుండా అనుసరిస్తోంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన పార్టీగా, వివిధ రంగాల్లో సమగ్ర అభివృద్దిని, గుడ్‌గవర్నెన్స్‌ను, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి, మానవ వనరులను ప్రోత్సహించేలా వైయస్ఆర్‌సీపీ పాలన సాగింది. అలాగే పోర్ట్‌ల వంటి కీలకమైన ప్రాజెక్ట్‌లను రెండుళ్ళ కోవిడ్ కాలాన్ని తీసేస్తే, మూడేళ్ళలో దాదాపు పదిహేను సంవత్సరాల ప్రగతిని చూపించిన ఘనత వైయస్ జగన్ గారిదే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పనిచేసింది. నేడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడూ దూరం కాలేదు. అందుకే వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన వెన్నుపోటు దినంకు ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చింది. ఎన్నికల హామీలను గాలికి వదిలేశారు 2019-24 మధ్య రైతులు, విద్యార్ధులు, మహిళలు, ఇలా ఏ రంగంలో అయినా ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వైయస్ జగన్ గారి ప్రభుత్వం తక్షణం స్పందించింది. నిరంతరం అధికార యంత్రాంగాన్ని మోటివేట్ చేస్తూ, పాలనను చురుగ్గా నడిపించారు. సమస్యలను పరిష్కరించే వరకు విశ్రమించలేదు. కానీ నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదు. ఎక్కడా ప్రజాసమస్యల గురించి మాట్లాడటం, వాటి పరిష్కారాన్ని ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఎన్నికల హామీలను బాండ్ పేపర్ మాదిరిగా రాసి, సంతకాలు చేసి ప్రతి ఇంటికీ పంచారు. అందుకే బకాయిలతో సహా ప్రజలకు మీరు ఇస్తామని చెప్పిన పథకాల సొమ్మును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబంకు, 50 లక్షల మంది రైతులకు, 66 లక్షల మంది పెన్షనర్లకు, 80 లక్షల మంది విద్యార్ధులకు ఇలా అనేక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇస్తామన్న పథకాలను చేరువ చేయాలి. ఇప్పటికే ఏడాదిలోనే నాలుగు లక్షల పెన్షన్లు రద్దు చేశారు. మిగిలిన పథకాల అమలు ఎప్పుడో తెలియదు. అయిదేళ్ళ పాటు మమ్మల్ని ప్రజలు ఏమీ చేయలేరనే దీమాతో చంద్రబాబు ఉన్నారు. రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ అప్పుల సొమ్ము ఏం చేస్తున్నారో తెలియదు. వైయస్ జగన్ తెచ్చిన అప్పులు ప్రజలకు ఎలా పంపిణీ చేశారో, ఏ స్కీంల కింద ఇచ్చారో చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. కానీ చంద్రబాబు హయాంలో ఇటువంటి ఏ లెక్కా లేదు. దీనిపైన కూడా ప్రజలు కడుపుమండి నిరసనల్లో పాల్గొన్నారు. అనేక చోట్ల ఆటంకాలు కల్పించారు ఈ శాంతియుత నిరసనలు కూడా జరగనివ్వకుండా అనేక ఆటంకాలు కల్పించారు. నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ర్యాలీలు చేయాలో కూడా పోలీసులే నిర్ధేశిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆయనపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు, ప్రజాసంఘాలకు ఉంటుంది. దానిని అడ్డుకునే హక్కు పోలీసులు ఎవరిచ్చారు? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి మూడేళ్ళలో కనీసం టీడీపీ నాయకులే కనిపించేవారు కాదు, ఏకంగా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచే వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించారు. కానీ ఈ రోజు వైయస్ఆర్‌సీపీ బలంగా ప్రజల్లోకి వెళ్లి, ప్రజల పట్ల బాధ్యతగా, నిబద్దతగా, అందుబాటులో ఉండాలని, జవాబుదారీతనంతో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబుకు ఒక అవకాశం ఉంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ప్రజలతో అసలు సంబంధం లేకుండా రాజకీయం చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పాలన సాగుతోంది. ఈ రోజు వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ఈ ప్రభుత్వంపై ఒక అంకుశం. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటును ప్రజలు మరిచిపోతారా? 1995లో సొంత మామకు వెన్నుపోటు పొడిచారు, ఈ సారి ఏకండా ఏపీ ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. ఈ విషయాన్ని ప్రజలే నిర్ధారిస్తున్నారు. అమరావతి పేరుతో స్వర్గాన్ని సృష్టిస్తున్నాను అని రాష్ట్రం బయట అందరినీ నమ్మించగలరేమో కానీ, ఈ రాష్ట్రంలోని ప్రజలను అలా నమ్మించలేరు. రాష్ట్రంలోని పేదలకు వైయస్ జగన్ పాలనలో అందించిన సంక్షేమాన్ని కూడా చంద్రబాబు దూరం చేశారు. కూటమి పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి పండుగ చేసుకోండి సంక్రాంతి, ఉగాది, దీపావళి కలిపి ఈ రోజు జరుపుకోవాల్సిన సందర్బం ఇది అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలు అంత సంతోషంగా ఉంటే, ప్రజల్లోకి వెళ్లి సంబరాలు జరుపుకోవచ్చు. నిజంగా పండుగ జరిగే సందర్భమే అయితే రేషన్ షాప్‌ల వద్దకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వృద్దులు, వికలాంగులు నిత్యావసర వస్తువుల కోసం ఎలా క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్నారో కనపిస్తుంది. ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ సదుపాయాన్ని వైయస్ జగన్ అందిస్తే, దానిని తొలగించి, ప్రజలను రోడ్లపై నిలబెట్టి, సరుకుల పంపిణీ కోసం గంటల కొద్ది వేచి ఉండే వ్యవస్థను తీసుకువచ్చారు. వృద్దులు, వికలాంగులు ఎలా క్యూలైన్లలో నిలబడుతున్నారో మీడియాలో వచ్చిన ఫోటోలు చూస్తే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి వారితో పండుగ సంబరాలు జరుపుకోండి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పేదలు ఉండే వాడల వద్దకు వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది సందర్భంగా సంక్రాంతి జరుపుకుందామని పిలుపు ఇవ్వండి, ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారో తెలుస్తుంది. పండుగ చేసుకునే పరిస్థితి లేదని కూటమి పార్టీలకు కూడా తెలుసు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలు దానిని ఆమోదించడం చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.