‘హెల్మెట్లు పెట్టుకుని రమ్మంటారా?’

రాబోయే రోజుల్లో న్యాయమూర్తులు ఉక్కు శిరస్త్రాణాలు ధరించి మరీ కోర్టులకు రావలసి ఉంటుందేమో!’
- ఈ మాటలన్నది ఎవరో దారే పోయే దానయ్య కాదు, భారత సర్వోన్నత న్యాయస్థానం -సుప్రీం కోర్టు- సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ సింఘ్వీ. మన రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది -పీవీ కృష్ణయ్య- న్యాయవాదుల ప్రవర్తనా సరళిపై సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపైవిచారణ చేస్తూ, జస్టిస్ సింఘ్వీ ఈ వ్యాఖ్య చేశారు. ఏ నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్య చెయ్యాల్సి వచ్చిందో చర్చించే ముందు న్యాయవ్యవస్థ ప్రాముఖ్యం గురించి ఒక్కసారి ప్రస్తావించుకుందాం.
న్యాయవ్యవస్థకు ప్రజాస్వామ్యంలో అపారమయిన ప్రాముఖ్యం ఉంది. ప్రజాస్వామ్యానికి నాలుగు వ్యవస్థలను మూలస్తంభాలుగా చెప్తారు. మొదటిది శాసన నిర్మాణ వ్యవస్థ. రెండోది శాసన పాలన వ్యవస్థ. మూడోది న్యాయవ్యవస్థ. నాలుగోది సమాచార వ్యవస్థ. ప్రజాస్వామ్యం మనుగడకు న్యాయవ్యవస్థ పనిచెయ్యడం ఎంత కీలకమో ఈ నిర్వచనాన్ని బట్టి గ్రహించవచ్చు. కానీ, మన మందస్వామ్యంలో న్యాయవ్యవస్థకు తగిన ప్రాధాన్యం దక్కుతోందా? ఆలోచించగలవాళ్లందరూ వేసుకోవలసిన ప్రశ్న ఇది.
రెండేళ్ల కిందట, ప్రత్యేక తెలంగాణ ఆందోళనకారులు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో సృష్టించిన అల్లకల్లోలం చాలామందికి గుర్తుండే ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామమోహనరావు, జస్టిస్ వంగా ఈశ్వరయ్య, జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి విచారణలు నిర్వహిస్తున్న కోర్టుల్లోకి తెలంగాణ ఆందోళనకారులు దూసుకుపోయి అతలాకుతలం చేశారు. న్యాయమూర్తులమీదికి కాజ్ లిస్టులనూ, భారీ పుస్తకాలనూ విసిరికొట్టిన ఘనత ఈ న్యాయవాదులకే దక్కింది. ట్యూబ్ లైట్లనూ, బుక్‌ర్యాక్‌లనూ, కిటికీల అద్దాలనూ ఇనప రాడ్లతో బద్దలుకొట్టిన వైనం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.
న్యాయవాదుల ఈ తరహా ప్రవర్తన మన రాష్ట్రానికే పరిమితమనుకుంటే పొరపాటు. అలహాబాద్(ఉత్తరప్రదేశ్)లోనూ, తమిళనాడులోనూ, కర్ణాటకలోనూ కూడా కొందరు ప్రబుద్ధులయిన న్యాయవాదులు న్యాయమూర్తులకు ‘ప్రెవేటు’ చెప్పేశారని సాక్షాత్తూ న్యాయమూర్తి సింఘ్వీయే సుప్రీం కోర్టులో వెల్లడించారు. ఆ నేపథ్యంలోనే ఆయన న్యాయమూర్తులు ఉక్కు శిరస్త్రాణాలు ధరించి రావడం గురించి ప్రస్తావించారు.జస్టిస్ సింఘ్వీ ప్రస్తావించని అంశం ఒకటి మనం ముచ్చటించుకుందాం. న్యాయవ్యవస్థ మనుగడకు న్యాయవాది సత్ప్రవర్తన ఎంత ముఖ్యమో, న్యాయమూర్తుల నీతివర్తన కూడా అంతే ప్రధానం. ఇటీవలే మన రాష్ట్రంలో న్యాయమూర్తులు లంచాలుపట్టి అధర్మానికి ఒడిగట్టారన్న ఆరోపణల పరంపర జాతి జనులను కలవరపరిచింది. హైకోర్టులో న్యాయమూర్తుల మీదికి పుస్తకాలు విసిరేసిన న్యాయవాదులు ఒకవంక- నీతిని నిలబెట్టాల్సిన న్యాయమూర్తులే కట్టుతప్పి ప్రవర్తించడం మరో వంక! కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవతా, నీ మనో నేత్రానికి కనబడే దృశ్యం ఎంత భయానకమో గదా!

Back to Top