ఎలక తోలు తెచ్చి....

భారత దేశంలో పోలిస్ శాఖ సమర్ధతకు కడు దూరంలో ఉంది. శిక్షణ, నిర్వహణల విషయంలో లోప భూయిష్టమయి ఉంది. ‘భారత దేశంలో పోలిస్ శాఖ సమర్ధతకు కడు దూరంలో ఉంది. శిక్షణ, నిర్వహణల విషయంలో లోప భూయిష్టమయి ఉంది. పర్యవేక్షణ తగినంతగా లేదు. ఈ శాఖను అవినీతి మయంగానూ, అణచివేతకు నిలయంగానూ పరిగణించడం కద్దు. ప్రజల విశ్వాసాన్నీ, సానుకూలమయిన సహకారాన్ని పొందడంలో పోలిస్ శాఖ ఘోరంగా విఫలమయింది’ - ఈ మటలు నిన్ననో మొన్ననో చెప్పినవి కావు! నూట పదేళ్ల కిందట ఓ బ్రిటిష్ ఉన్నతాధికారి వెలిబుచ్చిన అభిప్రాయాలివి. 1902లో, ఏ.హెచ్.ఎల్ ఫ్రేజర్ అధ్యక్షతన, ఏర్పడిన రెండో ‘పోలిస్ కమిషన్’ నివేదిక ఈ చేదు నిజాలను స్పష్టంగా పేర్కొంది. అప్పటికి నాలుగు దశాబ్దాల కిందట -1861లో- ఏర్పడిన ‘పోలిస్ చట్టం’ సంస్కరణ లక్ష్యంగా ఫ్రేజర్ కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ సూచనల్లో అమలయినవి తక్కువ. అందువల్లనే పోలిస్ వ్యవస్థ సంస్కరణ ఇప్పటికీ తక్షణావసరంగా మిగిలే ఉంది. ‘పోలిస్ సంస్కరణల ఆవశ్యకత’పై బుధవారం నాడు -అగస్ట్ 15న- హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ విషయాన్నే నిరూపించింది. ఈ సమావేశంలో చాలా మంది వక్తలు పాల్గొన్నారు. అయితే, వారిలో ఇద్దరు ఉత్తర దక్షిణ ధ్రువాల వంటివారు- చాలా ముఖ్యమయిన విషయాలను ప్రస్తావించారు. రిటైర్డ్ ఐపీఎస్ సీ ఆంజనేయ రెడ్డి సమావేశంలో పాల్గొంటూ పోలిస్ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తితో పాటు జవాబుదారీతనం కూడా అవసరమన్నారు. హక్కుల ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవేత్త బొజ్జా తారకం ఈ సమావేశంలోనే మాట్లాడుతూ పోలిస్ వ్యవస్థా, న్యాయవ్యవస్థా కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని -సోదాహరణంగా- ప్రసంగించారు. కేరళలో దాదాపు దశాబ్దం కిందటే ప్రవేశపెట్టిన పోలిస్ చట్టంలాంటిది మన రాష్ట్రంలో కూడా రూపొందించాలని ఈ సమావేశం తీర్మానించింది. ముందుగా పోలిస్ పెద్ద -ఆ మధ్యన కాంగ్రెస్ సింధువులో బిందువుగా లీనమయిపోయిన ప్రజా రాజ్యం పార్టీ బతికున్న రోజుల్లో ఆ పార్టీకి సలహాదారుగా కూడా ఉండినవారూ- ఆంజనేయ రెడ్డి అభిప్రాయాల సారాంశాన్ని పరిశీలిద్దాం. మన రాష్ట్ర పోలిస్ వ్యవస్థలో తక్షణం సంస్కరించాల్సిన అంశాలకూ, ఆంజనేయరెడ్డి ప్రతిపాదించిన స్వతంత్ర ప్రతిపత్తికీ ప్రత్యక్ష సంబంధం ఏమన్నా ఉందా? మన పోలిస్‌లను హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థి యువజనులు ముద్దుగా ‘ఖట్‌మల్’ అని పిల్చుకుంటారని మనలో చాలామందికి తెలుసు.ఖట్‌మల్ అంటే నల్లి. అదో పరాన్న జీవి. మనుషులు మంచి తిండితిని, అరిగించుకుని, తమ శరీర పోషణ కోసం ఉత్పత్తి చేసుకున్న రక్తాన్ని పీల్చుకు తాగే నీచ కీటకం నల్లి. అలాంటి నల్లితో పోలిస్‌లను పోల్చడంలో గొప్ప చమత్కారం, అలంకారం ఉన్నాయనిపిస్తుంది. పోలిస్ వ్యవస్థను మించిన పరాన్న భుక్కు వ్యవస్థ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. లాఠీలూ తూటాలను దుర్వినియోగం చేసి ప్రజల్లో కలిగించిన భీతాహమే ఈ పరాన్నభుక్కు వ్యవస్థకు పెట్టుబడి.నల్లులు దొంగచాటుగా నక్కి రక్తం పీలుస్తాయి. పోలీసులు బాహాటంగానే మన నెత్తురు తాగుతారు. అన్ని వర్గాల ప్రజల పౌర హక్కులనూ కాలరాయడమే తమ విధ్యుక్త ధర్మమని పోలిస్‌లు నమ్ముతారు. ఈ దేశంలో తమకూ, తమను పెంచి పోషించే అధికార స్వామ్యానికీ, దాన్ని నియంత్రించే రాజకీయ నాయకులకూ తప్ప మరెవరికీ స్వేచ్చా స్వాతంత్య్రాలు లేవనీ- ఉండనక్కర్లేదనీ పోలిస్ వ్యవస్థ నమ్మకం. తమకు చెప్పకుండా దొంగతనం చేయడాన్నే వారు నేరంగా పరిగణిస్తారన్నది ఓ బహిరంగ రహస్యం. నడిరోడ్డు మీద లంచం డిమాండ్ చేసి వసూలు చెయ్యడం పోలిస్‌లకు నిత్యకృత్యం. ఇక ఈ దేశంలో ఏ వేశ్యాగృహమూ ఖాకీ కీచకుల రక్షణా, దీవెనా లేకుండా మనజాలదని పత్రికలు అరిచిఅరిచి అలసిపోయాయి. ఇక మద్యం వర్తకం ఖాకీ గొడుగు నీడనే క్షణక్షణ ప్రవర్ధమానమవుతోంది. ఇది అది అననేల- మన సమాజంలో సాగే మంచీచెడూ వ్యాపారాలన్నింటి నుంచీ మున్ముందుగా పన్ను వసూలు చేసేది పోలిస్‌లే.ఇలాంటి వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తే దాని స్వభావంలో -సానుకూలమయిన- మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువో, కర్రపెత్తనం తీవ్రతరమయ్యే ప్రమాదం ఎక్కువో విజ్ఞులే తేల్చుకోవాలి. ఇకపోతే, ఆంజనేయ రెడ్డిగారు మాట్లాడుతూ, పోలిస్ వ్యవస్థకు జవాబుదారీతనం ఉండాలని కూడా చెప్పారు. పెద్దలు- సూక్తులు చెప్పే అర్హతా, యోగ్యతా వారికి ఉన్నమాట వాస్తవమే. కానీ, ప్రస్తు వ్యవస్థలో ఆయన చెప్పిన ‘జవాబుదారీతనం’ పోలిస్ శాఖ నుంచి ఆశించడంలో అర్థమేమయినా ఉందా?హక్కుల ఉద్యమ నేతగా చరిత్రాత్మక పాత్ర పోషించిన బొజ్జా తరకం మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థా, పోలిస్ వ్యవస్థా అపూర్వమయిన ‘విచక్షణ’తో వ్యవహరిస్తున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గొంతులో ముల్లయి కూర్చున్న ధర్మాన ఉదంతాన్నే తారకం ప్రస్తావించారు. పాలక పక్షానికి ప్రత్యర్థిగా ఉన్న ముద్దాయిని అరెస్ట్ చే యడానికి న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చెయ్యడమూ, పోలిస్ విభాగం సదరు ఆదేశాలను ఆఘమేఘాల మీద అమలు చెయ్యడమూ మనం చూసిందే! అదే ధర్మానలాగా పదవిలో ఉన్న ముద్దాయి విషయానికి వస్తే ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ హంసల ద్వంద్వ నీతిని ఏకిపారేశారు తారకం. ఇలాంటి ఇబ్బందికరమయిన అంశాలను పెద్దల సభల్లో ప్రస్తావిస్తే అందరికీ గొంతులు పట్టుకుంటాయన్న చిన్న విషయం తెలియదా మీకు, తారకం గారూ?! వాస్తవ పరిస్థితులను ఉన్నదున్నట్లుగా చర్చించుకునే సంస్కారం అలవర్చుకోనంత వరకూ ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి సంస్కారం పెరగాలంటే, ఈ సమావేశాల్లో జనసామాన్యం పాల్గొనే రీతిలో ప్రయత్నాలు జరగాలి! ప్రజాస్వామ్య సంస్కారం ప్రజల ద్వారా మాత్రమే సాధ్యం!

తాజా ఫోటోలు

Back to Top