దాదా దేశాన్ని గట్టెక్కిస్తారా?

అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అని ఏదో సినిమాలో ఓ హాస్యోక్తి విసిరారు. కానీ, ఇవాళ దేశం నిజంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న యూపీయే కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారుతూండడం ఈ క్లిష్టతను తీవ్రతరం చేస్తోంది. భజనపరులతో పొంగిపొరలుతున్న కాంగ్రెస్ పార్టీ ‘రాహుల్ రాకడ’ గురించి గొంతుచించుకోవడమే తప్ప యథార్థ సమస్యలకు వాస్తవిక పరిష్కారాలు సూచించే స్థితిలో లేదు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ,కాంగ్రెస్ పార్టీ అడుగులోనే అడుగేస్తూ, అడుసు తొక్కి కడుక్కోవడంలో తలమునకలవుతోంది. ఇక వామపక్షాలు చరిత్రలో కలిసిపోకుండా మిగలడానికి పడరానిపాట్లు పడుతూ, కొత్త తప్పులు చేయడంలో బిజీగా ఉన్నారు. జాతీయ నాయకత్వానికి సామాన్య జనంతో సంబంధాలు ఏనాడో తెగిపోయాయి. ప్రాంతీయ పార్టీలకు దక్కుతున్న ఆదరాభిమానాలే ఇందుకు తిరుగులేని నిదర్శనం! ఈ సందర్భంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎవరైనా అంటే వచ్చేది నవ్వు కాదు- ఏడుపు!

పపంచ బ్యాంకు ముద్దుబిడ్డలయిన మన్మోహన్ సింగ్- మాంటెక్ సింగ్‌లు పోటాపోటీగా అమలుచేస్తున్న ఆర్థిక విధానాల పుణ్యమాని ఈ రోజున సామాన్యుడి విస్తరిలోంచి కూరగాయలు మాయమయ్యాయి. వాటి స్థానంలో కోడిగుడ్లో, చేపలో, మాంసమో వచ్చి చేరితే బాగుండేది. అలా జరగలేదు. మన ‘నూతన ఆర్థిక విధానాల’ పర్యవసానంగా ఉన్నవి పోవడమే తప్ప ప్రత్యామ్నాయాలు వచ్చి చేరడం ఎన్నడూ జరగదు. దేశ జనాభాలో 70 శాతం మందికి తిండిపెడుతున్న వ్యవసాయాన్ని దండగమారి కార్యక్రమంగా మార్చి, రైతులు కూలీలుగా పరిణమించక తప్పని పరిస్థితులు సృష్టిస్తూనే ఉన్నారు పాలకులు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే చేనేత, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల చెరువులు లాంటి రంగాలు కూడా నానాటికీ తీసికట్టుగా పరిణమిస్తున్నాయి. ఒకవైపు వెండి బంగారాల ధరలు అంతరిక్షంలోకి దూసుకుపోతుంటే, మరోవైపు వ్యవసాయోత్పత్తుల ధరలు పాతాళానికి పతనమవుతున్నాయి. రియల్ ఎస్టేట్- షేర్ మార్కెట్‌లాంటి స్పెక్యులేటివ్ వ్యాపారాల్లో పోట్లగిత్తలూ, గుడ్డెలుగులూ వీరవిహారాలు చేస్తుండగా, చేనేతలాంటి వ్యవసాయానుబంధ పరిశ్రమలను నమ్ముకుని బతికేవాళ్లకు నికరంగా మిగులుతున్నవి నిరాశా నిస్పృహలే!

ఇలాంటి నేపథ్యంలో 14వ రాష్ట్రపతిగా గద్దెనెక్కబోతున్న ప్రణబ్ ముఖర్జీ -ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయినట్లు ప్రకటించడం, కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలి ఉంది- దేశాన్నేమయినా ఒడ్డెక్కించగలరా? లేక, ఉన్న క్లిష్ట పరిస్థితులనే మరింత సంక్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందా?

1969లో, ఇందిరా గాంధీ పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణల ద్వారాబ్యాంకుల జాతీయకరణ- రాజభరణాల రద్దు లాంటి చర్యలు చేపట్టిన దశలో ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పట్నుంచీ -కొద్దికాలం మినహాయిస్తే- నెహ్రూ కుటుంబానికి విధేయులుగా కొనసాగారు. ఇందిరా గాంధీ హత్యానంతరం ప్రధాని పదవి ఆశించిన పాపానికి ఆయన్ను రాజీవ్ గాంధీ మట్టానికి తొక్కేశారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ అధిష్టానానికి దూరంగా ఉన్న ప్రణబ్ చివరికి రాజీవ్ గాంధీ దయదల్చడం వల్లనే తిరిగి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించ గలిగారు. చేసిన తప్పు చేసే అలవాటు లేనందువల్ల మళ్లీ ఎన్నడూ ఆ కుటుంబ ప్రయోజనాలకు విరుద్ధమయిన ఆలోచనలు చెయ్యలేదు. పైగా, రాజీవ్ హత్యానంతరం సోనియా గాంధీని రాజకీయాల్లోకి రావలసిందిగా అందరికన్నా గట్టిగా అభ్యర్థించిన ఘనతను ప్రణబ్ దక్కించుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీపీఎం గుత్తపెత్తనాన్ని బద్దలుకొట్టిన - దరిమిలా అధికారం చేపట్టిన- మమతా బెనర్జీతో కాంగ్రెస్ అధిష్టానానికి సత్సంబంధాలు ఏర్పడేలా చెయ్యడంలో కూడా ప్రణబ్ కీలక పాత్ర వహించారు. (అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న సూక్తిని ప్రణబ్ ఎన్నికల సందర్భంగానే మమతా బెనర్జీ మరోసారి రుజువుచేశారు. అది వేరే విషయం!)ఈ సత్ప్రవర్తనకు మెచ్చి, సోనియా గాంధీ ఆయన్ను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టాలనుకోవడం ముదావహం.

అధిష్టానమ్మ ఆశీర్వాద బలంతో దాదా దేశాన్ని నందనవనంగా మార్చేస్తారని ఓ వర్గం గంపెడంత ఆశ ప్రకటిస్తోంది. నిన్నటిదాకా ఆర్థిక మంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్- మాంటెక్ సింగ్ జంటకవుల స్క్రిప్టునే అనుసరిస్తూ వచ్చిన ప్రణబ్ రాష్ట్రపతిగా మాత్రం అదనంగా ఒరగదోసేది ఏముంటుందని మరొక వర్గం పెదవి విరుస్తోంది. దాదా ప్రణబ్ ముఖర్జీ ఏంచేస్తారో యేమో!

Back to Top