అణగారిన వర్గాలకు మార్గదర్శి అంబేద్కర్  

మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ 

అనంతపురం: అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్రం సాధనకు అగ్రసైన్యాధిపతిగా నిలిచారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైయస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. శైలజానాథ్ మాట్లాడుతూ... సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్రం సాధనకు అంబేద్కర్ ఆశయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కులవ్యవస్థ కారణంగా అణగారిన వర్గాలు ఎదుర్కొన్న అన్యాయాలను తొలగించేందుకు అంబేద్కర్ జీవితాంతం పోరాడారని తెలిపారు. ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని చెప్పారు.

అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గం నేటి తరాలకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top