మామిళ్లపల్లి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించిన వైయ‌స్ఆర్‌సీపీ 

 న్యూఢిల్లీ :  గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ  త‌నూజ‌రాణి, పొన్నూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి అంబటి మురళి ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానాను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ, మామిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.

అలాగే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ), రాష్ట్ర డీజీపీ నుంచి నివేదికలను తెప్పించుకోవాలని కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎస్సీ మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని వారు ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ ఎస్సీ వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధితులు తమకు ఎదురైన పరిస్థితులను కమిషన్ చైర్మన్‌కు వివరించగా, వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషన్ సంబంధిత అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు.
 

Back to Top