తాడేపల్లి : ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని వైయస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు, ముద్రగడ పద్మనాభం తన నిబద్ధత, ముక్కుసూటితనం, రాజీలేని పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని స్మరించారు. ముద్రగడ మరణం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ సేవలను గౌరవిస్తూ, ఆయన కుటుంబ సభ్యులను బాధించేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా ఏమన్నారంటే.. - కాపు ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీపడని పోరాటం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసినా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సామాజిక వర్గ హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభమే. - ముక్కుసూటితనం, నిజాయితీ ఆయన ప్రత్యేకత ముక్కుసూటితనం, నిజాయితీ, పట్టుదల, ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడటం ముద్రగడ గారి వ్యక్తిత్వానికి ప్రతీక. ఒక పని చేపడితే పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గేవారు కాదు. చేయగలిగితే చేస్తానని, చేయలేకపోతే చేయలేనని స్పష్టంగా చెప్పే ధైర్యం ఆయనది. అలాంటి లక్షణాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. - ఇచ్చిన మాట కోసం పేరే మార్చుకున్న నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే తన పేరే మార్చుకోవడానికి కూడా సిద్ధపడిన అరుదైన నాయకుడు ముద్రగడ. వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే ప్రజల విశ్వాసానికే విలువ ఇచ్చిన ఆయన రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. - రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర గోదావరి జిల్లాలకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు ముద్రగడ. కాపు ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన పేరు చెరగని ముద్రగా నిలుస్తుంది. - వైయస్ జగన్‌తో సుదీర్ఘ అనుబంధం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే రోజుల నుంచే ముద్రగడ గారికి వైయస్ఆర్‌సీపీతో అనుబంధం ఉంది. కాపు ఉద్యమం కోసం కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా, తిరిగి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. - 2016 కాపు ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది 2016లో జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు ముద్రగడ. ఎన్నో కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా కాపు సమాజ హక్కుల కోసం పోరాడారు. ఆ పోరాటం ఎప్పటికీ మరవలేనిది. - ఆతిథ్యానికి మరో పేరు ముద్రగడ ముద్రగడ గారి ఆతిథ్యం గురించి తెలిసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు. తుని ఉద్యమ సమయంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పటికీ స్వయంగా అందరినీ పలకరించి, భోజనం పెట్టి పెట్టి ఆదరించారు. ఆయన ఓర్పు, సేవాభావం మాలాంటి నాయకులకు రోల్ మోడల్. - కుటుంబాన్ని బాధించేలా ట్రోలింగ్ చేయొద్దు ముద్రగడ గారి మరణాన్ని రాజకీయ కోణంలో చూసి ఆయన కుటుంబ సభ్యులు మరింత మానసిక వేదనకు గురయ్యేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయవద్దు. ఆయన త్యాగాల గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోనూ, కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలోనూ నూటికి నూరు శాతం నిబద్ధతతో నిలిచిన నాయకుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. - పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. వైయస్ఆర్‌సీపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముద్రగడ సేవలు, త్యాగాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా ఘన నివాళి అర్పించారు.