నరసాపురం : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపు మేరకు నరసాపురం పట్టణం మరియు మండల వైయస్ఆర్‌సీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నరసాపురంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ, మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు, ఎస్‌ఈసీ సభ్యుడు పీడీ రాజు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ వీరన్న, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి వెంకటరమణ, నరసాపురం టౌన్ అధ్యక్షుడు కామన్ బుజ్జి, జడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, ఎంపీపీ సోని, మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శి జాన్ కెనెడీ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బంధన్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర అగ్నికుల కార్పొరేషన్ అధ్యక్షుడు తిరుమల నాగరాజు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు కావలి నాని తదితరులు పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.