శ్రీకాకుళం: తరాలు మారినా చెదరని స్ఫూర్తి అంబేద్కర్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం రూపొందించి దాదాపు 80 సంవత్సరాలు అయినప్పటికీ అది చెక్కుచెదరకుండా కొనసాగడం అంబేద్కర్ మహోన్నతతకు నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజ్యాంగాలు తరచూ మారుతున్నాయని, కానీ భారత రాజ్యాంగం ప్రజల విశ్వాసాన్ని పొందుతూ నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం మార్పులు ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలే గానీ, కొద్దిమంది కోసం కాకూడదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈ దిశగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించిందని, విద్య, సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుందని తెలిపారు. సమసమాజం సాధించాలంటే వివక్షలు పూర్తిగా తొలగే వరకు పోరాటం కొనసాగించాలని, ప్రజల కోసం పని చేసే వైయస్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడం ప్రజల బాధ్యత అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.