బాబు డాక్యుమెంటరీ హిస్టరీ

చంద్రబాబు ప్రచారం పిచ్చి హైక్స్, హైటెక్స్ దాటిపోయి పీక్స్ కు వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోయినప్పుడల్లా ఏదో ఒక ఉపద్రవం జరుగుతోంది. బాబుగారికి పని మీద కంటే ప్రచారం మీద యావ ఎక్కువైపోతూ ఉండటం ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. ఓ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు కవర్ చేయడం సాధారణమే కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రమే కవర్ పేజీ కావాలన్న యావే ఎన్నో సమస్యలకు కారణం అవుతోంది. కంట్రీ వైడ్ గా రాష్ట్రం పరువు నవ్వుల పాలౌతోంది. విపత్తుల్లోనూ బాబు తన విద్వత్తూ, ప్రచార గమ్మత్తులకు పులిస్టాప్ పెట్టడం లేదు. ఆయన అడుగుపెట్టినప్పుడు విశాఖలో వచ్చిన హుద్ హుద్ నుంచి, నిన్న శ్రీకాకుళాన్ని ముంచిన టిట్లా, కోస్తా తీరాన్న వణికిస్తున్న పెథాయ్ వరకూ ఏ తుఫాను వచ్చినా చంద్రబాబు దాన్ని మైలేజీ కోసం వాడుకోవడం ఆనవాయితీ అయిపోతోంది. 
తుఫాన్లను టెక్నాలజీతో అడ్డుకున్నామని, సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పుకున్న చంద్రబాబు తాజాగా తన ప్రచార యావ కోసం పెథాయ్ తుఫాను రెస్క్యూ ఆపరేషన్ పనులను డాక్యుమెంటరీ తీయమని హుకుం జారీ చేసాడు. అంటే తుఫాను బాధితులను రక్షించడం, వారికి పునరావాసం, బాబుగారి టెలీకాన్ఫరెన్సులు, బాధితులతో బస్సులోంచి పరామర్శలు, పులిహోర పొట్లాల పంపిణీ ఇలాంటివన్నీ రికార్డు చేయాలన్నది బాబుగారి ఆజ్ఞ. తుఫానుకు ముందు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు కంటే తుఫాను తర్వాత తాను చేసే పనులకు ప్రచారం చేసుకోవడమే బాబు ప్రాధాన్యం అయిపోయింది. 
ఇదే డాక్యుమెంటరీ యావతో పుష్కరాల్లో పదులమంది ప్రాణాలను గాల్లో కలిపిన ఉదంతం రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. నాలుగేళ్లు సాగదీసిన విచారణ కమిటీ నిజాలకు పాతరేసినా, ఆ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితుల కుటుంబాలకు, వాస్తవాలను చూడగలిగిన ప్రతివారికి అక్కడ జరిగిందేమిటో సులువుగానే అర్థం అయ్యింది. క్రౌడ్ షూటింగ్ కోసం పడ్డ తాపత్రయంలో తోపులాట జరిగి 40 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ డాక్యుమెంటరీని కూడా బైటపెట్టకుండా రహస్యంగా దాచిన చంద్రబాబు ప్రభుత్వం నేడు అదే ప్రచారార్భాటం కోసం పాకులాడుతోంది. అబద్ధాలైనా సరే సొంత ప్రచార సంస్థల ద్వారా పదే పదే ప్రచారం చేయించుకుని పబ్బం గడుపుకోవాలనే బాబు సిద్ధాంతానికి కాలం చెల్లబోతోందంటున్నారు తెలుగు ప్రజలు. 


 
Back to Top