బాదుడు కాలం.. ధరల మోత యోగం

 
మన్మోహన్ సింగ్ బాటనే ఎంచుకుంది ఆంధ్రప్రదేశ్ కూడా. ధరల పెంపుతో ప్రజల్సి బెంబేలెత్త్తిస్తోంది. కనీస అవసరాలకు దూరం కావాల్సిన పరిస్థతి ఆవిష్కృతం కాబోతోందని సామాన్యుడు సణుగుతున్నాడు. 
దేశంలో బాదుడు కాలం నడుస్తోంది. ధరల పెంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యున్ని ఎడాపెడా బాదేస్తున్నాయి. పాలకుల బాదుడు తట్టుకోలేక సగటుజీవి సతమతమవుతున్నాడు. సంస్కరణల సారథి నేతృత్వంలో నడుస్తున్న ప్రగతిశీల సంకీర్ణ సర్కారు మోపిన ధరాభారాన్ని మోసేందుకు కన్నీళ్లు దిగమింగాల్సిన స్థితి. తానేం తక్కువ తినేలేదన్నట్టుగా రాత్రికి రాత్రే సీఎం అయిన కిరణ్‌కుమార్ రెడ్డి అదే బాటను ఎంచుకుని  సర్‌చార్జి వడ్డించేశారు. ముందుంది మంచికాలమంటూ మురిపిస్తున్న ముఖ్యనేత పేదోడి బండిపై వడ్డించారు. ఆరుకు కుదించిన సబ్బిడీ వంటగ్యాస్ సిలెండర్లను తొమ్మిదికి పెంచాలని అధిష్టాన దేవత ఆర్డరు వేసినా సీఎం సారు సావధానంగా చూద్దాంలే అంటూ సాగదీస్తున్నారు. 
చిటికెల పందిరి
కేంద్రంలో హస్తం పార్టీ సారథ్యంలో నడుస్తున్న యూపీఏ ప్రభుత్వం అదును చూసి బక్కజీవిని దెబ్బకొట్టింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అలా ముగియగానే బాదుడు లంకించుకుంది. రాయితీల కోతను పట్టాలెక్కించింది. డీజిల్ ధరను భారీగా పెంచేసిన మనోహ్మన్ సర్కారు వంట గ్యాస్ సిలెండర్లపై వార్షిక పరిమితి విధించింది. పెట్రోల్, కిరోసిన్ ధరలు పెంచలేదు సంతోషించండి అంటూ ఊరడింపు మాటలతో చిటికెల పందిరి వేసింది. డీజిల్ ధరల పెంపుతో అన్నిరకాల వస్తువుల రేట్లు కొండెక్కుతాయన్న వాస్తవాన్ని దాచేందుకు దాగుడుమూతలు ఆడుతోంది. అంతటితో ఊరుకోకుండా చిల్లర వర్తకుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు లాకులె త్తేసింది.
ధరల పెంపునకు సమర్థన
తమ చర్యలను యూపీఏ సంకీర్ణ సర్కారు సారథి డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశప్రజల సాక్షిగా సమర్ధించుకున్నారు. భవిష్యత్ బాగు కోసమే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని సింగ్‌జీ సెలవిచ్చారు. డబ్బు చెట్లకు కాయవని చెప్పి కళ్లు తెరిపించారు. ఎఫ్‌డీఐలతోనే నిధుల ప్రవాహం పారుతుందని, పైకం ఉంటేనే పాలన సాగించగలమని ప్రవచించారు. మరి కుంభకోణాలతో పక్కదారి పట్టిన డబ్బు ఏ చెట్లకు కాసిందని నిలదీస్తే మౌనముని అయిపోతారు మన గౌరవ ప్రధాని. తనకు నచ్చని ప్రశ్నలు వేస్తే పీఎం మన్మోహన్ మౌనవ్రతం పడతారు.
ఇక కేంద్రం బాదుడుతోనే బాధపడుతున్న రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు సర్దుబాటు చార్జీలతో కరెంట్ షాకిచ్చింది. ముణ్ణాళ్ల ముచ్చటగా సాగిన అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే హడావుడిగా అర్ధరాత్రి పూట సర్దుబాటు చార్జీల జీవో ఇచ్చేసి కేంద్రానికి తామేమీ తీసిపోమని సీఎం కిరణ్ నిరూపించారు. గృహ వినియోగదారులపై ఏకంగా రూ.1800 కోట్ల భారం పడనుంది. ఇక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రూ.4,222 కోట్ల మోత మోయాల్సిందే.
ముచ్చట తీర్చుకున్న ఆర్టీసీ 
పెరిగిన ఇంధన ధరలను సాకుగా చూపి సామాన్యుడి బండిగా పేరుబడ్డ ఆర్టీసీ బస్సు టిక్కెట్ చార్జీలపై భారీగా వడ్డించేసింది. సంపన్నవర్గాలు ప్రయాణించే ఏసీ బస్సులను వదిలేసి.. గ్రామీణులు, మధ్యతరగతి ప్రజలు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, డీలక్సు, సూపర్ లగ్జరీ సర్వీసుల టికెట్ల ధరలు పెంచేసింది. సామాన్య ప్రయాణికులపై రూ. 362.90 కోట్ల భారం మోపింది. గ్రామీణులు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సులో కనీస చార్జీని రూ. 5కు పెంచింది. డీజిల్ ధరల మాటున సర్కారు ప్రయాణికులను దోపిడీ చేస్తోంది. ఆర్టీసీ వినియోగించే డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఎత్తివేస్తే చార్జీలు నయాపైసా పెంచాల్సిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి ఉండాలేగాని ఆర్టీసీని నష్టాల నుంచి ఒడ్డున పడే సేందేకు మార్గాలు బోలేడు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవడినంతకాలం సామాన్యుడికి బాదుడు బాధలు తప్పవు.
Back to Top