అమరావతిపై ఆర్కిటెక్టుల మాట

అసెంబ్లీ భవనాల నమూనాలంటూ కన్ని డిజైన్సును సి.ఆర్.డి.ఎ వెబ్ సైట్లో ఉంచింది టిడిపి ప్రభుత్వం. దానిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. నిజంగా ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇస్తే ప్రభుత్వం దేశీయ నిర్మాణ రంగ నిపుణులను రాజధాని నిర్మాణానికి ఉపయోగించుకుని ఉండేది అంటున్నారు ఇండియన్ ఆర్కిటెక్టులు. ప్రపంచ స్థాయి సంస్థ అంటూ గప్పాలు కొట్టిన నార్మన్ పోస్టర్ ఇచ్చిన అరడజను పైగా డిజైన్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. 

రాజధాని నిర్మాణం అనే మాట మొదలైనప్పటి నుంచి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చరో లెక్కలేదు. 2015లో ఆచార్యనాగార్జునా యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ విభాగాన్ని రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణాల నమూలనాలను తయారు చేయమన్నారు. తర్వాత జపాన్ మకీ అర్కెటెక్చర్ కంపెనీని సంప్రదించారు. రామ్ కుల్హాస్, రిచర్డ్ రోజర్స్, రోజర్స్ స్టిక్ హార్బర్, వాస్తు శిల్ప అనే సంస్థలూ డిజైన్లు చేయడానికి బిడ్ లు దాఖలు చేసాయి. అదయ్యాక రోజర్ స్టర్క్ హార్పర్, నార్మన్ పోస్టర్, పోస్టర్ ప్లస్ పార్టన్స్ అనే మూడు ప్రపంచ స్థాయి ఆర్కెటెక్చర్ సంస్థలను పిలిపించారు. అందులో రెంటికి ఉద్వాసన పలికి నార్మన్ పోస్టర్ వాళ్లతో గత కొన్నాళ్లుగా డిజైన్ల గురించి డిస్కస్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు చూస్తున్న ఈ డిజైన్లన్నీ కేవలం అవుట్ లుక్ మాత్రమే అంటున్నారు దేశీయ ఆర్కిటెక్చర్లు. బాహ్య ఆకృతులు నాకు నచ్చి తీరాలని పట్టుబడుతున్నారు. అన్ని వర్గాల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుండటంతో నార్మపోస్టర్ వారు చేసిన కొన్ని డిజైన్లను ఆన్ లైన్ లో పెట్టి ప్రజాభిప్రాయం సేకరిస్తాం అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఉన్న డిజైన్లలో ప్రజలకు నచ్చి, వారు మెచ్చిన డిజైన్ ని ఎంపిక చేయాలి కదా. మళ్లీ లండన్ లో నార్మపోస్టర్ కంపెనీకి ఆయన, రాజమౌళి, ఇతర బృందం కలిసి ఎందుకు వెళుతున్నట్టు. అక్కడ మరో రెండు డిజైన్లను పరిశీలించడానికట. అంటే ఇక్కడ ప్రజాభిప్రాయం అన్నమాట అంతా ఒట్టిది. అసలు ఒక ఆర్కెటెక్ట్ ప్రతిష్టాత్మకమైన నిర్మాణం అందులోనూ ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని నిర్మించేటప్పుడు ఆ ప్రాంత పరిస్థితులను అంచనా వేస్తారు. అక్కడి నేటివిటీని ప్రతిబింబించేలా ఆ నిర్మాణం ఉండేలా డిజైన్ చేస్తారు. పైగా అసెంబ్లీలాంటి ఓ పరిపాలనా సంబంధమైన నిర్మాణం అంటే లోపల ఉండాల్సిన ప్రత్యేక వసతుల గురించి ముందుగా సమీక్షిస్తారు. కాని నార్మన్ పోస్టర్ ఇందులో ఏ ఒక్కటీ చేయలేదు. బాబు కోరినట్టే పైన పటారానికే విలువిచ్చింది. అవికూడా మన బాబు గారికి ఆనకపోవడం వేరేకథ.

తీరంలో నిర్మాణాలు ముప్పేనన్న వాస్తుశిల్పులు
ఇక అమరావతి ప్రాంతం రాజధానికోసం సెలక్ట్ చేసిన ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు అనువు కాదని చాలామంది దేశీ అర్కిటెక్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రాజధానికి అనుకూలం కాదని పర్యావరణ వేత్తలు కూడా విమర్శిస్తున్నారు.  జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ఈ నగరం పర్యావరణానికి తీవ్ర విఘాతం అని చెప్పింది. వేలాది ఎకరాల అటవీ భూములను మింగేస్తూ నిర్మించాలనుకున్న ఈ నగరం పెద్ద భూ కుంభకోణం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కృష్ణా తీరంలో కట్టబోయే ఈ నగరానికి ముంపు ప్రమాదం ఎక్కువే అంటున్నారు ఆర్కిటెక్టులు. ఇటీవలే ప్రపంచ బ్యాంక్ తనిఖీ బృందం కూడా నదీతీరంలో  నిర్మాణం గురించి ఆరాతీసిందని అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు వస్తాయని గొప్పలు చెబుతున్న బాబు ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం చెప్పిన విషయాలను రహస్యంగా ఉంచారు. తనిఖీ తర్వాత ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణ ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలా వద్దా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. నదీతీరం కావడంతో ఇక్కడి పర్యావరణ పరిస్థితులు మహానగర నిర్మాణానికి అనుకూలం కాదని ప్రపంచ బ్యాంకు భావించడమే అందుకు కారణం కావచ్చన్నది నిపుణుల వాదన. ఈ  అనుమానంతోనే చాలా విదేశీ కంపెనీలు రాజధాని పెట్టుబడులకు దూరంగా ఉంటున్నాయని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాజధాని అక్కడే కడతానంటూ పాడినపాటే పాడుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో 8600చదరపు కిలోమీటర్లలో 1.25కోట్ల మంది నివసించేలా నిర్మాణాలు ఎలా జరగుతాయో ఇంకా అర్థ కాని మిస్టరీనే. 

Back to Top