ఇరిగేషన్ కాదు అంతా లిటిగేషన్

  • చేసింది గోరంత – పబ్లిసిటీ కొండంత
  • ఆరంభించామని డప్పు కొడుతున్న ప్రాజెక్టుల ద్వారా అవసరమైన మేరకు నీటి తరలింపే లేదు
  • పాతిక ప్రాజెక్టుల పేర్లు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు
  • అంచనా వ్యయం పెరిగిందనడం, పనులను జాప్యం చేయడం ఇదీ చంద్రబాబు సర్కార్ తీరు
రాయలసీమ విషయంలో చంద్రబాబుది మాటలు కోటలు, చేతలు బూటకాలు అన్నట్టే ఉంటుంది. కృష్ణానదికి అపారమైన వరద వచ్చినా, గోదావరి జలాలను తరలించినా సీమ ప్రాంతంలో ఈ సంత్సరం కాదు కాదా వచ్చే రెండేళ్లలో కూడా నిల్వ చేసేందుకు అవసరమైన పూర్తి సామర్థ్యం ఉన్న రిజర్వాయిర్లు లేవు. మరి వేటిల్లో నీటిని నిల్వచేస్తారో రాయలసీమను కరువుకు దూరం చేస్తారో ముఖ్యమంత్రిగారే సెలవివ్వాలి అని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, పైలాన్లు, హారతులు పదుల కొద్దీ ఇరిగేషన్ ప్రాజెక్టులంటూ ఊదర గొడుతున్న చంద్రబాబు నిజానికి చేస్తున్నదేమిటో తెలిపే చిరు ప్రయత్నం ఇది. 

పట్టిసీమ-కృష్ణా గోదావరి అనుసంధానం –రాయలసీమను కోనసీమను చేస్తాం. కృష్టా డెల్టాలో కరువు మాట లేకుండా చేస్తాం అని ప్రగల్బాలు పలికారు చంద్రబాబు. మహా ఘనకార్యంగా చెప్పుకున్న పట్టిసీమ ప్రయోజనాలు ఏ ప్రాంతానికీ దక్కలేదు కాని ప్రభుత్వ పెద్దలకు భారీగా లాభం ముట్టింది. ఈ విషయాన్ని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది.రూ. 1600 కోట్ల ప్రాజెక్టులో 360 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో బయటపెట్టింది. కృష్టా డెల్టాకు అరకొరా నీటి చుక్కలతో సరిపెట్టి, రాయలసీమకు చుక్కనీరు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది.

ముచ్చుమర్రి – రాష్ట్రప్రజలను ఏమార్చే మరో కథకు వేదికైంది ముచ్చుమర్రి. శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం 798అడుగులు ఉన్నప్పుడు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకోవచ్చని స్వయంగా బాబుగారు సెలవిచ్చారు. నిజానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద శ్రీశైలం రిజర్వాయర్ లోకి అప్రోచ్ కెనాల్ తవ్వింది కేవలం 812 అడుగుల వరకే. అంటే ఈ మట్టం కంటే నీరు తగ్గితే ముచ్చుమర్రి నుండి చుక్క నీరు కూడా తోడే అవకాశం ఉండదు. 

పురుషోత్తం పట్నం  - ప్రాజెక్టులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం, జాతికి అంకితం చేసేయడం చంద్రబాబుకే చెల్లింది. హంద్రీనీవా నుండి మోటార్లు తెప్పించి పురుషోత్తం పట్నం ప్రాజెక్టుకు హడావిడిగా ప్రారంభోత్సవం చేసారు. ఇప్పటికీ దాని పైపు లైన్ల పని పూర్తి కాలేదు. అసలు పురుషోత్తం పట్నం నీటిని ఎక్కడికి మళ్లిస్తారనే దానిపైనా సమాధానం లేదు. ఎందుకంటే కాలువలు సిద్ధం కాలేదు, అనేక చోట్ల ఎన్ హెచ్, సాధారణ రోడ్లకు అడ్డంగా వంతెనలు నిర్మించాలి. అవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇవేవీ పూర్తి కాకుండానే పురుషోత్తపట్నం జాతికి అంకితం అయిపోయింది. 

పెదపూడి రిజర్వాయర్ – సుజల స్రవంతి ఫేజ్ -1 కోసం పెదపూడి రిజర్వాయిర్ పనులకు 2022కోట్ల అంచనాతో జారీ చేసిన జివోను ఆవిష్కరించడమే ఈ ప్రాజెక్టుకు బాబు చేసిన పని. ఇది అమలు ఎప్పుడయ్యోనో, ఆ నిధులు పూర్తిగా వినియోగం అయి, పనులు పూర్తయ్యేనో బాబుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. 

పైడిపాలెం – 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పైడిపాలెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మూడేళ్లలో పుష్కలంగా నిధులు అందించారు. 667కోట్ల రూపాయిల నిధులు వెచ్చించి 80శాతం పనులు వైయస్ హయాంలోనే పూర్తి అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 23.82 కోట్లతో మిగిలిన పనిని పూర్తి చేసి పైడిపాలం ఘనతంతా నాదే అంటూ డప్పాలు కొట్టారు. వైయస్ తలపెట్టి దాదాపుగా పూర్తిచేసిన ప్రాజెక్టును సీమకు జలక్రాంతి అంటూ సిగ్గులేకుండా తమపేరిట చెప్పుకున్నారు.

హంద్రీ నీవా – 3,850క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్విన ప్రధాన కాలువలో రెండు వేల క్యూసెక్కులు కూడా ప్రవహించడం లేదు. హడావిడిగా కాలవ విస్తరణ జరుపుతున్న చంద్రబాబు సర్కార్ బ్రాంచి కాలువలు, పంట కాలువలు తవ్వడం లేదు. ఇందుకు అవసరమైన భూసేకరణ సమస్యపైనా ఏమాత్రం దృష్టిపెట్టలేదు. హంద్రీ నీవా రెండు దశలకూ కలిపి 6,850కోట్ల అంచనాలతో పాలనామోదం పొందగా, గత సంవత్సరం 11,770 కోట్లకు దీని నిర్మాణవ్యయం పెరిగింది. 

గాలేరు-నగరి – సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యం అంతం నేనే అని చెప్పుకునే చంద్రబాబు గాలేరు నగరి విషయంలో ప్రదర్శించే వైఖరి చూస్తే అది పచ్చి అబద్ధం అని అర్థం అవుతుంది. 2016-17లో తొలిదశ 5,646 కోట్లు, రెండొవ దశకు 2,525 కోట్లు పాలనామోదం పొందగా గతేడాదే దీనికి 4,789 కోట్లు వ్యయం చేసారు. ప్రస్తుతం 439 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు కోసం విడుదల చేసారు. ఏటికేడాది వ్యయం పెరగడం, పనులు మందకొడిగా ఉండటం చంద్రబాబు సర్కార్  ప్రాజక్టుల ప్రేమకున్న ప్రత్యేకతలు. 

గుండ్లకమ్మ – ఈ ప్రాజెక్టుకు మోక్షమెప్పుడో తెలియకుండా ఉంది. వైయస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కోసం 543 కోట్ల నిధులు ఇచ్చారు. చంద్రబాబు ఇంత వరకూ 34 కోట్లు మాత్రమే విదిలించారు. మూడేళ్లలో కనీసం 30 కోట్ల పనులు కూడా పూర్తి చేయలేదు. 80వేల ఎకరాకు సాగునీరు, ఒంగోలు నగరంతోపాటు 43 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకానికి 44ఎకరాల భూమిని సేకరించడంలో టిడిపి ప్రభుత్వం దారుణంగా విఫలం అయ్యింది. చాలా కొద్ది మేరకు తవ్వాల్సి ఉన్న కాలువ నిర్మాణం కూడా గాలికొదిలేసారు. పేరుకు ప్రాజెక్టు పరిధిలో భూములున్నా అవన్నీ బీళ్లే. రెండేళ్లుగా వర్షాభావంతో ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. 

అవుకు టన్నెల్ – ఏ ప్రాజెక్టు నైనా ఆలస్యం చేయడం, అంచనా వ్యయాలు పెంచడం, నమూనాలను ఇష్టం వచ్చినట్టు మార్చడం బాబు ప్రభుత్వం ఎప్పుడూ చేసేదే. అవుకు టన్నెల్ ను ఫాల్ట్ జోన్ పేరుతో 5వేల క్యూసెక్కులకే పరిమితం చేసింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా తగ్గించి ప్రాజెక్టు లక్ష్యానికే గండికొట్టేసారు. వైయస్సార్ ఈ జలాశయం సామర్థ్యాన్ని రెండింతలు పెంచి, 790కోట్లు కేటాయించారు. బాబు దాని రూపు రేఖలు, లక్ష్యాలను తుంగలోతొక్కారు.

ఎగువ శ్రీకాకుళం నుంచి దిగువ అనంత వరకూ సాగునీటి ప్రాజెక్టుల సాగదీత పనులు తప్ప రాష్ట్రానికి బాబు ఒరగబెడుతోంది ఏదీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైయస్ ఆర్ హయాంలో చేసిన ఎన్నో సాగునీటి పథకాలకు అక్షింతల్లా నిధులను జల్లి, ప్రాజెక్టు పూర్తవడానికి తానే కారణమని ప్రజలను నమ్మించాలనుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా ప్రజలు బాబులా గజనీలు కాదని వారంటున్నారు. టిడిపి రంగు పూసుకున్న పచ్చపత్రికలు రానున్న రోజుల్లో కానున్న కాటన్ దొర బాబే అంటూ భజన చేస్తున్నాయి. 
Back to Top