ఆయన.. కొంచెం ఎక్కువ సమానం

సృష్టిలో మగ, ఆడ సమానం... 
అవును సమానమే సందేహమేముంది..
కానీ, మగ వాడు ఆడదానికంటె కొంచెం ఎక్కువ..

ఇది రాధాగోపాళం చలనచిత్రంలో స్త్రీపురుష సమానత్వంపై లక్ష్మి, విష్ణుమూర్తి పాత్రధారులతో ముళ్ళపూడి వెంకట రమణ పలికించిన వ్యంగ్య సంభాషణ. 
సీబీఐ వైఖరి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సన్నివేశం గుర్తొస్తుంది. వాన్‌పిక్ కేసులో రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు పట్ల ఆ దర్యాప్తు సంస్థ వ్యవహరించిన వైఖరి.. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనే సామెతను గుర్తుచేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి ఇదే కేసులో తాజాగా వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకూ రిమాండ్ విధించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం.  మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ సైతం ఈ విషయంలో సీబీఐ బాధితుడే. 

'తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సీబీఐ.. అదే కేసులో నిందితులుగా ఉన్న మంత్రుల విషయంలో పూర్తిగా పక్షపాత వైఖరి ప్రదర్శించిందనీ,  రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉదంతంతో ఇది బహిర్గతమైందనీ'  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్‌లకన్నా ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ భావిస్తున్నదో ప్రజలకు చెప్పాలని నిలదీయడం గమనార్హం.  సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో 26 జీవోలలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపిస్తూనే... ఎక్కడా అందుకు కారకులైన మంత్రులు, సెక్రటరీలను పేర్కొనలేదు. సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంతో గత్యంతరంలేక చార్జీషీట్లలో ఒకరిద్దరు మంత్రులు, కొందరు సెక్రటరీలను చేర్చింది. సీబీఐ దాఖలు చేసిన నాలుగవ చార్జిషీట్‌లో నలుగురికి తప్ప మిగతా 24 మందికి బెయిల్ లభించింది.  ఎనిమిదేళ్ళుగా మంత్రిగా ఉన్న వ్యక్తి, 25 ఏళ్లుగా సర్వీసులో ఉన్న కార్యదర్శులు ఏ రకంగానూ  ప్రభావితం చేయలేరని ఏ రకంగా భావిస్తోందో  ప్రజలకు సమాధానం లేని ప్రశ్న. సచివాలయంలో ఏనాడూ అడుగుకూడా పెట్టని  వైయస్ జగన్ ఈ కేసులో సాక్షులను ఎలా ప్రభావితం చేస్తున్నారని భావిస్తోందో కూడా అంతే సమాధానం లేని అంశం.  అందునా ఆయన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.  ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన 280 రోజులకు అరెస్టు చేసి ఈ వాదన వినిపించడం సీబీఐ పక్షపాత వైఖరికి  ఉదాహరణ.

ఈ కేసులో మంత్రి ధర్మానకు ముందస్తు బెయిలివ్వడం వాన్‌పిక్ నిందితులకు గుండెలు మండేలా చేసింది. తాము చేసిన పాపమేమిటి.. ధర్మాన చేసిన పుణ్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం తెలిసిన వెంటనే మోపిదేవి అనుచరులు కోర్టు వద్ద ఆందోళనకు దిగడం, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలివ్వడం చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ధర్మన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కనీసం వ్యతిరేకించను కూడా లేదు. అరెస్టు చేస్తామని సీబీఐ ప్రకటించిన నిముషాల్లో కాంగ్రెస్ నేతలు మోపిదేవి నుంచి రాజీనామా లేఖను బలవంతంగా తీసుకున్నారు. లేఖపై సంతకం చేయించుకోవడం టీవీ ఛానల్సులో కనిపించింది కూడా. 

నెలలు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. వాన్‌పిక్ జీవోల జారీ అంశంలో కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరు అధికారులు మన్మోహన్ సింగ్, సామ్యూల్, మరికొందరు ప్రైవేటు వ్యక్తులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. 
క్యాబినెట్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరికీ భూమిని కేటాయించలేరని ధర్మాన వ్యాఖ్యానించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మోపిదేవి ఒక్కడినీ ఎలా అరెస్టు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ధర్మాన రాజీనామాపై నిర్ణయిం తీసుకోకుండా వ్యవహరించడం కూడా విమర్శలకు తావిచ్చింది.  ఛార్జిషీటు దాఖలైన వెంటనే ఆయన రాజీనామా చేశారు. కానీ, అరెస్టు చేయాలని సీబీఐ నిర్ణయించిన క్షణంలోనే మోపిదేవి నుంచి రాజీనామా లేఖను తీసుకుని గవర్నరుకు పంపించేశారు. ఒకే అంశంలో రెండు విధాలుగా ఎలా వ్యవహరిస్తారని ఆయన అనుచరురలు నిలదీస్తున్నారు. ధర్మానను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపిస్తున్నారు.
మోపిదేవి వెంకట రమణ, నిమ్మగడ్డ ప్రసాద్‌లను సీబీఐ ఇందులో ఇరికించిందనే అంశం స్పష్టమవుతోందని వారు అంటున్నారు. మంత్రలపై జగన్ వత్తిడి తెచ్చారన్న అంశంపై సీబీఐ వివరణ ఇవ్వాలని వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం మర్కట న్యాయాన్ని తలపిస్తోందని జగన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Back to Top