సింహం సింగిల్‌గానే వస్తుంది

పొత్తు పెట్టకోవాల్సిన అవసరం వైయస్‌ఆర్‌ సీపీకి లేదు

అరిస్తే పిల్లి పులి అయిపోదు బాబూ.. పిల్లి పిల్లే.. పులి పులే

ఐదు సంవత్సరాలు దిక్కులేదు కానీ, అమరావతిని అమెరికా చేస్తావా..?

చంద్రబాబును నమ్మి మోసపోయింది చాలు.. మళ్లీ నమ్మొద్దు

జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాడు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల

గుంటూరు: పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని చంద్రబాబు రోషం, పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు. పవన్, కాంగ్రెస్‌ పార్టీలతో లోపాయకారీ ఒప్పందాలు చేసుకొని నిసిగ్గుగా వైయస్‌ఆర్‌ సీపీపై ఆరోపణలు చేస్తున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీకి ఎవరితో పొత్తులు అవసరం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది, ప్రజల ఆశీర్వాదంతో బంపర్‌ మెజార్టీ సాధిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వైయస్‌ షర్మిల పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సుపరిపాలన గురించి మీకు చెప్పాల్సిన పనిలేదు. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అద్భుతంగా పాలన చేశారు. ఐదేళ్లలో ఏ రోజూ ఒక్క సారి చార్జీలు, పన్నులు పెంచకుండా, సంక్షేమం, అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. ప్రతి వర్గానికి న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ ఒక్కరేనని గర్వంగా చెప్పుకోగలం.

రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు. ఇప్పుడు పసుపు – కుంకుమ అని పేరు పెట్టి మహిళలను మభ్యపెడుతూ కనీసం వడ్డీలకు కూడా సరిపోని డబ్బులు ఇస్తున్నాడు. ఎంగిలి చేయి విధిలిస్తున్నాడు.. నమ్మి మోసపోకండి. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ అన్నాడు.. కానీ ఇవ్వడం లేదు. పాపం తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని ఎంతోమంది యువకులు చదువులు మానేస్తున్నారు. ఆ పాపం చంద్రబాబుదే. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులు లేవు. ఇప్పుడు జబ్బులు వస్తే పేదవాడు మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లాలి. చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జబ్బులు వస్తే గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్తారా.. ఇది అమానుషం కాదా..? 

పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. నిజంగా చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటే పోలవరం పూర్తయ్యేది. అమరావతిలో వేల ఎకరాలను స్వాహా చేసుకున్నారు. కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చిందని ఒక మంత్రి చెప్పాడంట. ఒక్క ఫ్లైఓవర్, ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనానికి దిక్కులేదు కానీ, అమరావతికి అమెరికాను తెస్తాడంట. శ్రీకాకుళానికి హైదరాబాద్‌ తీసుకువస్తాడంట. 

చంద్రబాబు కొత్తగా ఆయనకు అస్సలు సూటవ్వని పదాలు వాడుతున్నాడు. పౌరుషం, రోషం వైయస్‌ జగన్‌కు లేక లొంగిపోయాడని మాట్లాడుతున్నాడు. చంద్రబాబేనా రోషం, పౌరుషం గురించి మాట్లాడేది. కాంగ్రెస్‌ పార్టీలో ఓడిపోతే అల్లుడని ఎన్టీఆర్‌ తన పార్టీలో చేర్చుకున్నాడు. ఓడిపోయిన వ్యక్తి అధికార పార్టీలో చేరాడంటే.. పౌరుషం ఉందంటారా..? పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాడు. పౌరుషం అప్పుడు బజారుకు వెళ్లిందా.. బీజేపీతో పొత్తుపెట్టుకోనని 2004లో చెప్పాడు. మళ్లీ 2014లో పొత్తుపెట్టుకొని నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశాడు.. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా.. హరికృష్ణ మృతదేహాన్ని పక్కనబెట్టుకొని కేసీఆర్‌తో పొత్తుకు వెంపర్లాడాడు. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉందని అరిస్తే పులి అయిపోతుందా...? పిల్లి పిల్లే.. పులి పులే.. నిసిగ్గుగా పవన్‌ కల్యాణ్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. ఏ ఒక్క ఎన్నిక సొంతంగా గెలిచింది లేదు. ఈయన పౌరుషం గురించి మాట్లాడుతున్నారు. 

 

ఓదార్పు అనే మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్‌ను వదిలేసి కష్టాలు ఎదుర్కొన్నాడు. అందుకే పిల్లి పిల్లే.. పులి పులే.. ఒక్క ఎన్నికను కూడా పొత్తు లేకుండా ఎదుర్కోలేని చంద్రబాబు.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లుతున్నాడు. మాకు ఎవరితో పొత్తు లేదు.. అవసరం కూడా లేదు. సింహం సింగల్‌గానే వస్తుంది. వైయస్‌ఆర్‌ సీపీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలో అన్ని సర్వేలు గొప్పగా చెబుతున్నాయి. మాకు ఎవరి సపోర్టు అవసరం లేదు. మాకు కావాల్సింది దేవుడి దయ, ప్రజల దీవెన అంతే. 

చంద్రబాబు మీ ఓట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అమ్ముడుపోతారా.. చంద్రబాబు ఎంత డబ్బులు ఇచ్చినా మీకు పడిన బాకీ తీర్చలేరు. ఈ ఐదేళ్లలో ఏ తల్లిదండ్రులు ఫీజులు కట్టారో ఆ ఫీజు, వడ్డీ కలిపి లెక్కేస్తే చంద్రబాబు మీకంత బాకీ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు అన్నాడు. ఈ ఐదేళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రికి రూ. 25 వేలు బాకీ. మాది మాకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేయండి. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఐదు సంవత్సరాల్లో ఇంటికి రూ. 1.20 లక్షలు బాకీ పడ్డాడు. 

అమరావతి, విశాఖలో వేల ఎకరాలను స్వాహా చేశాడు. ఆ భూమి అంతా మీదే. మీ భూమి మీకు రాసిచ్చేయమని చెప్పండి. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలకు, మరమగ్గాలకు మొత్తం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డీతో కలిసి మొత్తం ఇచ్చేయమని వసూలు చేయండి. కానీ, ఓటేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. మాట తప్పని, మడమ తిప్పని జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం వస్తుంది.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఒక్క చంద్రబాబు కొడుక్కు మాత్రమే వచ్చింది. కనీసం జయంతికి, వర్థంతికి తేడా కూడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏకంగా మూడు శాఖలకు మంత్రులను చేశాడు. ఏ అర్హత, ఏ అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు. కానీ ప్రజలకు మాత్రం ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. తేలేదు ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి అవసరమా.. 

అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. వెన్నుపోటు పొడిచినవాడు పోవాలంటే, రైతు రాజు కావాలంటే, చెప్పింది, చెప్పనిది కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని, మడమ తిప్పవాడు కావాలంటే జగనన్న రావాలి. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. బాబు వస్తే కరువు వచ్చింది. అందుకే బాబును ఇంటికి పంపిద్దాం.. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి.. మీకు సేవ చేసే అవకాశం జగనన్నకు ఇవ్వండి. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా రోశయ్యను నిలబెడుతున్నాం. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

 

Back to Top