ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షించాలి

హైదరాబాద్, 23 డిసెంబర్ 2013:

ప్రేమ పేరుతో యువతులను మోసగించే వారిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రేమ పేరుతో 21 ఏళ్ళ బీటెక్‌ విద్యార్థిని అరుణను మోసగించడమే కాక పెళ్ళి చేసుకోమన్నందుకు కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఆమె మరణానికి కారణమైన సైదులు అనే ప్రేమోన్మాదికి తగిన శిక్ష విధించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో ప్రభుత్వాన్ని పద్మ కోరారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడలు పెరిగిపోయాయని, వారికి భద్రత లేకుండా పోయిందని వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తంచేశారు. 'నిర్భయ' లాంటి కఠినమైన చట్టాలు చేసినా, సమాజంలో మార్పు రాలేదని, ప్రేమ పేరుతో ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ మృగాలను కఠినంగా శిక్షించినప్పుడే.. నిర్భయ మొదలు అరుణ వరకూ ప్రేమోన్మాదుల ఘాతుకానికి బలైపోయిన ఎందరో యువతుల ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె తెలిపారు. ప్రేమోన్మాది దాష్టీకానికి బలైపోయిన అరుణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పద్మ విజ్ఞప్తి చేశారు.

Back to Top