రిజర్వేషన్ల స్ఫూర్తికి ప్రభుత్వం తూట్లు

హైదరాబాద్, 10 జూన్‌ 2013:

రిజర్వేషన్ల స్ఫూర్తికి అధికార కాంగ్రెస్‌ పార్టీ తూట్లు పొడుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి, కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ఆరోపించారు. వెనుకబడిన, అణగారిన వర్గాలు, మహిళలు చైతన్యవంతులు కావాల‌నే సదుద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించినట్లు మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రం నలుమూలలా ఉన్న ఈ వర్గాల వారు అందరితో సమాన స్థాయిలో రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, పరిపాలించే హక్కు వారికి కూడా కల్పించేందుకే రిజర్వేషన్ల ప్రక్రియ వచ్చిందన్నారు. స్థానిక రిజర్వేషన్ల విషయంలో ఏ విధానం అనుసరిస్తున్నదీ శాసనసభలో సమగ్రంగా ప్రకటించాలని మైసూరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం గతంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని సీట్లు కేటాయించేదని మైసూరారెడ్డి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారని పత్రికల్లో చూశామన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్ల, ఈ విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారో చెప్పకుండా గోప్యంగా ఉంచడం వల్ల ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన వారికి సీట్లు కేటాయించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అభ్యంతరం చెప్పారు. ఏ స్థానం రిజర్వేషన్‌ కిందకు వస్తుందో, ఏది రాదో తెలియక పోవడంతో జిల్లా స్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొన్నదని అన్నారు. తమ వంది మాగధులు, బంధువులు, తమకు నచ్చినవారికి రిజర్వేషన్లు కల్పించుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం రిజర్వేషన్ల విధానంపై రహస్యంగా వ్యవహరిస్తోందని మైసూరారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికలను కూడా కలెక్టర్లతోనో, ఎస్పీలతోనో తప్పుడు నివేదికలు తెప్పించుకుని అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మైసూరారెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల ద్వారా న్యాయం జరగాల్సిన వారికి అది అందకుండా చేయడం, తమ ఇష్టం వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పించడం అధికార పార్టీ ధ్యేయంగా ఉందన్నారు. ప్రభుత్వం తీరు కేవలం వెనుకబడిన వర్గాలు, మహిళలు, ఎస్సీలకు అన్యాయం చేయడమే అన్నారు. రిజర్వేషన్లను డీ లిమిటేషన్‌ను ప్రభుత్వం చేతిలో పెట్టుకోవడం దేశంలో మరెక్కడా లేదన్నారు.

రిజర్వేషన్‌ చేసిన స్థానాలను ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించాల్సిన సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. మంచి పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారని, నోటిఫై చేసిన రిజర్వేషన్ల వివరాలను వెల్లడించాలని, న్యాయంగా ఏయే వర్గాలకు అవి దక్కాలో వారికి దక్కుతున్నాయో లేదో చూసుకునేందుకు అవకాశం కల్పించాలని మైసూరారెడ్డి విజ్ఞప్తిచేశారు. నోటిఫై చేసిన రిజర్వేషన్ల వివరాలు ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top