హైదరాబాద్, 19 డిసెంబర్ 2012: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3,900లకు పత్తి కొనుగోలు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు. అధిక దిగుబడి వస్తుందని రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేశారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయకపోతే ఆరు వేల కోట్ల రూపాయల మేరకు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులే దేశానికి వెన్నముక అని చెప్పే పాలకులు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా పెట్టుబడులు విఫరీతంగా పెరిగాయని, కానీ దిగుబడులకు మాత్రం మద్దతు ధర రావడంలేదని పార్టీ కార్యాలయంలో బుధవారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సాగు కోసం రైతు ఎకరాకు రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారని, దిగుబడి 8 క్వింటాళ్లు వస్తే క్వింటాలుకు రూ.5 వేల వరకు ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.3,900లు మాత్రమేనని అన్నారు. ఆ ధర కూడా చెల్లించకపోతే రైతులు అప్పుల ఊబిలో చిక్కుకు పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల స్తిరీకరణ కోసం రాష్ట్రంలో ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి సూచించారు. ఆ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ధరల స్థిరీకరణ జరగకపోతే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామన్నారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన పత్తి, వరి ధాన్యాలను కొనుగోలు చేయడంలేదన్నారు. రైతు సమస్యలపై పోరాడిన, ఆందోళనలు చేసిన ఘనత వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారని, లేకుంటే ఇపుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేవారని అన్నారు.