ఆంధ్రుల ఆత్మగౌరవం చంద్రబాబు తాకట్టు

హైదరాబాద్, 7 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం తెలుగువారి ఆత్మగౌరవాన్ని నడివీధిలో కించపరిచినట్టే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, ఆయన విధానాన్ని పరిశీలిస్తే.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారని నిప్పులు చెరిగారు. సుమారు 70 రోజులుగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్న ఆరేడు కోట్ల మంది సీమాంధ్రుల మనోభావాలను, వారి వేదనను ఖాతరు చేయకుండా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ ఉధృతిని చూసి అయినా చంద్రబాబు నాయుడు జై సమైక్యాంధ్ర అంటారేమో అని అందరం భావించామన్నారు. కానీ.. రాష్ట్ర విభజనకు తాను ఇచ్చిన లేఖకు కట్టుబడే ఉన్నానని ప్రక్రియను త్వరగా పూర్తిచేయండి అనే విధంగా చంద్రబాబు మాట్లాడారని దుమ్మెత్తిపోశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి చంద్రబాబు తీరును తూర్పారపట్టారు.

కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై విభజనకు కారకుడైన చంద్రబాబే నిరాహార దీక్షకు కూర్చోవడం హంతకుడే దీక్ష చేసిన విధంగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు ప్రదర్శించిన హావభావాలు, ఆయన మాటల తీరు చూస్తే.. తెలుగు ప్రజల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో రాజకీయాల గురించి మాట్లడను అంటూనే వాటి గురించే మొత్తం మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఏనాడూ నిజాలు మాట్లాడని చంద్రబాబు నాయుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న అన్ని 25 లోక్‌సభా స్థానాలు వస్తాయని ఈ రోజు ఒక నిజం చెప్పారన్నారు.

బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌ పార్టీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కైందని, ఈ కుమ్మక్కు కారణంగానే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించిందంటూ చంద్రబాబు నాయుడు పదే పదే విమర్శలు చేయడాన్ని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కుమ్మక్కైనందుకేనా శ్రీ జగన్మోహన్‌రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నదని ఆయన ప్రశ్నించారు. కుమ్మక్కైనందుకేనా కేసులు పెట్టించుకున్నదని నిలదీశారు. కుమ్మక్కైనందుకేనా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు అనర్హత ముద్ర వేయించుకున్నదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అందరికీ తెలిసిందే అన్నారు. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేయడమేమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

నాలుగేళ్ళుగా తాను చేసి రాజకీయాన్ని మరిచిపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహానేత వైయస్ఆర్‌ లాంటి వ్యక్తి సిఎంగా ఉంటే.. వ్యతిరేక ఓటు ఉండదన్నారు. గడచిన నాలుగేళ్ళుగా అన్ని చార్జీలు, ధరలు పెంచేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేక ఓటు ఉందన్నారు. ప్రజలు చీదరించుకునే స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో తప్పిదాలు చేస్తే.. చంద్రబాబు ఏ రోజైనా దీక్ష చేశారా? అలా చేయని తనకు వ్యతిరేక ఓటు ఎలా వస్తుందని ఊహించుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వ్యతిరేక ఓటు కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతోందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అజ్ఞాని అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు మాటల్లో ఆయనకు రాజకీయ అవగాహనా రాహిత్యం బయటపడుతోందన్నారు.

చంద్రబాబు ఆలోచనా విధానాలు, రాజకీయ అవగాహనా రాహిత్యం, కుమ్మక్కు రాజకీయాలు ఈ రోజు ఢిల్లీలో స్పష్టంగా కనిపించిందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్‌తో ఎన్నో రకాలుగా కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వాటిని కప్పిపుచ్చుకోవడానికు ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టిడిపిలు పలుచోట్ల కలిసి, విడివిడిగా పోటీ చేసినా కడపలో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దేశంలో మరెక్కడా రానంత భారీ మెజారిటీతో గెలిచిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. ఉప ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు కూడా రాని దుస్థితిని ప్రస్తావించారు. గడచిన నాలుగేళ్ళుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు మద్దతుగా ఉంటున్న విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా విప్‌ జారీచేసి కాపాడినందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతారంట అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇచ్చిన విభజన లేఖను అనుకూలంగా తీసుకుని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడిందని శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అలాంటి చంద్రబాబు నాయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, సోనియా గాంధీ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించడం మంచిది కాదని హెచ్చరించారు. ఢిల్లీలో కూర్చుని ఒక్కమాట కూడా రాహుల్, సోనియా గురించి అనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారంటే ఆయన రాజకీయ విలువలేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నైజం పూర్తిగా ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసన్నారు.

తెలంగాణపై తన వైఖరి మారలేదని ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ చెబుతున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇరు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలని చెప్పడాన్ని శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తావించారు. సమన్యాయం ఎలా జరగాలో పరిష్కారం చెప్పమంటే చెప్పరంట.. తనకు అధికారం ఇస్తే చేస్తారంట అని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకూ చంద్రబాబు చేసిన తప్పిదాలను మరిచిపోని ప్రజలు మళ్ళీ తనకు ఓటు ఎలా వేస్తారని అనుకుంటున్నారని చంద్రబాబును నిలదీశారు. జెఎసిలతో పాటు రాజకీయ పార్టీలను కూడా పిలవండని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేకపోయిందని అన్నారు. ఇక చంద్రబాబుకు నాయకత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఎవరిని మభ్యపెట్టడానికి చంద్రబాబు దీక్ష చేస్తున్నారో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటానని చెప్పకుండా విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరే విధంగా చంద్రబాబు మాట్లాడడం ఏమిటని నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు వారిపై విరుచుకుపడిన విధానాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3ను తీసుకున్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అంశం కూడా ఉండవచ్చన్నారు. ఆర్టికల్‌ 3ను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కనిపెట్టినట్టుగా, అంతకు ముందు లేనట్టుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించారు.

శ్రీ జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా 16 నెలలు ఆపగలిగారు కానీ నేరం రుజువు కాని వ్యక్తిని ఎంతకాలం నిర్బంధంలో ఉంచగలరని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే శ్రీ జగన్‌కు బెయిల్‌ వస్తే.. వ్యవస్థలను కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడడం తగదన్నారు. అంటే వ్యవస్థల పట్ల చంద్రబాబుకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. తనపై అవినీతి ఆరోపణలు వస్తే.. దడదడలాడిపోయిన చంద్రబాబు ముందే మేనేజ్‌ చేసుకున్న వైనాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అనాలోచిత విధానాలు, స్వార్థం వల్లే రాష్ట్రం ఇలాంటి దుస్థితికి వెళ్ళిందని ఆవేదన వ్యక్తంచేశారు. కుమ్మక్కు రాజకీయాల ద్వారానే ఈ రోజు ఢిల్లీలోనే ఎపి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడానికి, నిరాహార దీక్ష చేయడానికి చంద్రబాబు అనుమతి తెచ్చుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ఇతరులపై నిందలు వేయడం మానుకుని, ధైర్యం ఉంటే ప్రజల తరఫున నిలబడాలని చంద్రబాబుకు శ్రీకాంత్‌రెడ్డి సలహా ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top