'జిఓఎం గోబ్యాక్' : కొణతాల పిలుపు

హైదరాబాద్, 9 అక్టోబర్ 2013:

'సైమన్‌ కమిషన్‌ గో బ్యాక్‌' అన్న తీరులోనే కేంద్రం నియమించిన గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్సు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గో బ్యాక్‌ అనాలని సమైక్యాంధ్ర వాదులకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. సోనియా గాంధీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టడం సరికాదని పేర్కొంది. సీమాంధ్ర తగలబడిపోతుంటే.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని దుయ్యబట్టింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రోద్బలంతోనే రాష్ట్ర విభజనకు కేంద్రం ఉత్సాహంగా ఉరుకులు పెడుతోందని విమర్శించింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ బుధవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

విభజన చిచ్చు వచ్చినప్పటి నుంచీ సుమారు 70 రోజులుగా రాష్ట్రం రావణకాష్టంలా తగులబడిపోతుందని కొణతాల ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవైపున ఎన్జీవోలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు అన్ని వర్గాల వారూ మూకుమ్మడిగా ఉద్యమిస్తున్నారన్నారు. స్వాతంత్ర్యపోరాట ఉద్యమ కెరటాల్లా వారంతా ఆందోళనలు చేస్తున్నారన్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్రం విద్యుత్‌ లేక రాష్ట్రం అంధకారమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరో వైపున వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారానికి 5వ రోజుకు చేరిందన్నారు. నెల రోజుల వ్యవధిలో రెండవసారి నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌ శరీరంలో కీటోన్లు 4+కు చేరాయని అన్నారు. సుగర్‌ స్థాయిలు 54కు పడిపోవడంతో శ్రీ జగన్‌ దీక్షను తక్షణమే విరమించకపోతే శరీరంలోని చాలా భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రం, ప్రజలు సమైక్యంగా ఉండాలని దీక్షను కొనసాగిస్తున్నారని అన్నారు.

రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే దేశంలోనే ఉన్నతమైనదిగా తీర్చిదిద్ది ప్రజలకు మేలు చేకూర్చేలా చేయాలని శ్రీ జగన్‌ దీక్ష చేస్తున్నారని కొణతాల పేర్కొన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమో, రాజకీయ కక్షసాధించడానికో లేక రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న ఆకాంక్షతో మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చడానికి సోనియా గాంధీ చూస్తుంటే.. తట్టుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందని అన్నారు.

ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు విభజన ప్రక్రియను మరింత ముందుకు వెళుతోందని కొణతాల విమర్శించారు. గతంలో తమ పార్టీ బృందం రాష్ట్రపతిని, ప్రధానిని కలిసినప్పుడు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్సును తప్పకుండా వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. విభజన వల్ల తలెత్తే ఇబ్బందులను ఆ కమిటీకి చెప్పండి, సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారన్నారు. కానీ అలా ‌సమస్యలకు పరిష్కారం చూడకుండానే ఈ నెల 3న కేంద్ర కేబినెట్‌లో పెట్టి నోట్‌ను ఆమోదించిన వైనాన్ని చూస్తే.. రోమ్‌ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించిన చందంగా ఉందని ఆయన అభివర్ణించారు. ఈ జిఒఎం సైమన్‌ కమిషన్‌లా ఉందంటూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కొణతాల ప్రస్తావించారు. సైమన్‌ గో బ్యాక్‌ అంటూ టంగుటూరి ప్రకాశం పంతులు పిలుపునిచ్చిన విధంగానే సమైక్యవాదులు ఈ జిఒఎంను గోబ్యాక్‌ అనాలని కొణతాల పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో పరిపాలన కుంటుబడిందని, ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేయక అస్తవ్యస్తం అయిపోయిందని కొణతాల ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని అవస్థలు సీమాంధ్రుల పడుతుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా, వారిని పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడం విచారించదగ్గ విషయం అన్నారు. ఇప్పటికైకా కేంద్ర విభజన ప్రక్రియను ఆపి, వాస్తవ పరిస్థితులను గమనించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

సోనియా గాంధీ విధేయుడినని, ఆమె నియమిస్తేనే తాను సిఎం అయ్యానని కిరణ్‌ కుమార్‌రెడ్డి చెబుతూనే.. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని అంటున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా పాడిందే పాడుతున్నారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్‌ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడే సిఎం స్పందించి ఉంటే, ఏయే అంశాలపై రాష్ట్రంలో ఇబ్బందులు ఏర్పడతాయని శ్రీకృష్ణ కమిటి నివేదికలో పేర్కొందో వాటిపై దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రం ఈ రోజు రావణకాష్టం అయ్యేది కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితికి పూర్తి బాధ్యత కిరణ్‌కుమార్‌రెడ్డి వహించాలని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుర్మార్గాల విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని కొణతాల విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాంటూ ఆయన దీక్ష చేస్తారేమో అని తామంతా ఆశించామన్నారు. అయితే, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా ఒక్క మాట మాట్లాడలేదని దుయ్యబట్టారు. రెండు కళ్ళ సిద్ధాంతానికి బదులు ఇప్పుడు ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికీ నాలుగైదు లక్షల కోట్లిస్తే.. కొత్త రాజధానిని కట్టుకుంటామంటూ గతంలో చెప్పిన ప్రతిపాదనకే ఆయన కట్టుబడి ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. తొమ్మిదేళ్ళు సిఎంగా పనిచేసిన వ్యక్తి స్థాయిలో ఆయన వ్యవహరించడంలేదన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలమా లేక విభజనకు కట్టుబడి ఉన్నారా? అన్న జాతీయ మీడియా ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పని వైనాన్న కొణతాల ప్రస్తావించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానంటున్న చంద్రబాబు వ్యాఖ్యలను కొణతాల ఎద్దేవా చేశారు. అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు కానీ విభజనకు అనుకూలంగా కేంద్రానికి తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే చాలని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చంద్రబాబు ఒక్క మాట అంటే విభజన ప్రక్రియ ఇప్పటికైనా ఆగిపోయే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఉత్సాహంగా, ఉరకలు వేస్తూ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరగకుండా చేసుకునే ఆలోచనతోనే లాలూచీపడి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు బలిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన విధానాన్ని మార్చుకుని సమైక్యాంధ్రకు ముందుకు రావాలని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి, రాజ్యాంగ సంక్షోభం తీసుకువస్తే.. తప్ప విభజన సమస్యకు పరిష్కారం ఉండదని కొణతాల అన్నారు. క్షుద్ర రాజకీయంలో భాగంగా తీసుకున్నదే విభజన నిర్ణయం కాబట్టి, అది వెనక్కి పోవాలంటే రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్రలోని 25 మంది ఎంపిలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామాల విషయంలో నిజాలు దాచిపెట్టి కేంద్ర మంత్రులు వ్యవహరిస్తుంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని అనుమానం వ్యక్తంచేశారు. సమైక్యవాదంపై అన్ని పార్టీల నాయకులూ కలిసి పోరాడదామని కొణతాల విజ్ఞప్తిచేశారు.

సోనియా గాంధీ స్వార్థ ప్రయోజనాల కోసమే విభజన లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కొణతాల విమర్శించారు. మరో పక్కన దిగ్విజయ్‌ సింగ్‌ విషయానికి వస్తే.. గతంలో మీరు లేఖ ఇచ్చారు.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనకు చాలా ఆప్తమిత్రుడు, ఆయన కుమారుడు శ్రీ జగన్‌ తనకు కొడుకు లాంటి వారని చెబుతున్నారన్నారు. అందుకేనా వైయస్ఆర్‌ మరణించిన తరువాత ఆయనను ముద్దాయిగా ఎఫ్ఐఆర్‌లో పెట్టారా? అని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టవద్దని దిగ్విజయ్‌సింగ్‌కు ఆయన సూచించారు.

Back to Top