ఢిల్లీ పీఠం కదిలేలా 'సమైక్యశంఖారావం'

హైదరాబాద్, 19 అక్టోబర్ 2013:

ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి కో ఆర్డినేటర్ కొణతాల ప్రజలకు పిలుపునిచ్చారు.‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 26న హైదరాబాద్‌లో ఎల్‌బి స్టేడియంలో పార్టీ నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభను విజయవంతం చేద్దామని రామకృష్ణ అన్నారు. సమైక్యవాదులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని కొణతాల పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలుగుగడ్డ విడిపోకూడదని కొణతాల రామకృష్ణ అన్నారు.

తెలుగు జాతిని రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాల్సిన అవసరముందని, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే విభజన ఆగుతుందని కొణతాల అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని, అలాగే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని కొణతాల కోరారు.

కాంగ్రెస్, టిడిపిలకు సోనియా డెరైక్షన్‌ :
రాష్ట్రం విభజనకు వ్యతిరేకంగా సుమారు 80 రోజులకు పైగా సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతున్నప్పటికి కూడా.. ఆందోళన కార్యక్రమాలను మరింత పెంచే విధంగానే కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారని కొణతాల నిప్పులు చెరిగారు. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటామంటూనే, మరో పక్క విభజన అనివార్యం అంటూ అందుకు కావాల్సిన సహాయ సహకారాలను కేంద్రానికి అందించేందుకు జీవోఎం (మంత్రుల బృందానికి)కు ప్రతిపాదనలు పంపుతున్నారని దుయ్యబట్టారు. తాము మొదటి నుంచీ చెబుతున్నట్లుగా.. సోనియాగాంధీ దర్శకత్వంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారన్నారు. వారి డ్రామాలు ఒక్కొక్కటిగా రుజువవుతున్నాయని పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉంటేనే అభివృద్ధి :
కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుజాతి సమైక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమైందని కొణతాల రామకృష్ణ అన్నారు. 1969, 72లో వచ్చిన ఉద్యమాల తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలు సోదరభావంతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేశారని వివరించారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పటికీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా అనే పరిస్థితిలో కూడా నాడు వై‌యస్ చేపట్టిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి కుంటుపడలేదన్నారు. ‌జిఎస్‌టిలో రూ.8 లక్షల కోట్లతో దేశంలోనే మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత అభివృద్ధి కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదే‌శ్ నిలిచిందన్నారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ హక్కు మాదిరిగా తిండి, గూడు, ఆరోగ్యం ఇలా ప్రతిదీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించారని వివరించారు. అభివృద్ధితో వేర్పాటువాదాన్ని మరిపించగలిగారన్నారు.‌ మహానేత వై‌యస్ ఆశయ సాధన కోసం ఏర్పడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందనే దృఢమైన విశ్వాసం ఉందని చెప్పారు.

‌ప్రజల ఆలోచనకు వ్యతిరేకం విభజన నిర్ణయం :
రాష్ట్రాన్ని విభజించాలని యుపిఎ ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల ఆకాంక్షకు పూర్తి వ్యతిరేకమైనదని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించాలనుకోవడం దారుణమన్నారు. ఈ విషయమై గతంలో కేంద్ర హోంమంత్రిగా ఎల్‌కె అద్వానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘ఆగస్టు 1, 2000న పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిగా ఎల్‌కె అద్వానీ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. అంతేకా‌కుండా 26-2-2002న 377 నిబంధన కింద తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆలె నరేంద్ర అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు’ అని కొణతాల వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మీడియాకు అందజేశారు. డిసెంబర్ 9, 2009న కేంద్రహోంమంత్రిగా చిదంబరం మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పిన ప్రకటనను కూడా యుపిఎ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

Back to Top