'ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టబద్ధతపై స్పష్టత కావాలి'

హైదరాబాద్‌, 29 నవంబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగానే ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలపడ్డారని వైయస్‌ఆర్ సీఎ‌ల్‌పి ఉప నేత భూమా శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడాన్నిస్వాగతిస్తున్నామని పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, గొల్ల బాబురావు అన్నారు. అయితే, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే విషయంలో రెండు రోజులు మాత్రమే అసెంబ్లీని నిర్వహిస్తే పూర్తిస్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉండదని, మరింత సమయం కేటాయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పార్టీ శాసనసభా పక్ష నేత శ్రీమతి విజయమ్మ బిఎసిలో డిమాండ్‌ చేసినట్లు శోభా నాగిరెడ్డి వెల్లడించారు. బిఎసిలో అన్ని ప్రతిపక్షాలు కూడా ఇదే డిమాండ్‌ చేశాయన్నారు. తమ డిమాండ్‌పై అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రభుత్వాన్ని కోరిన తరువాత ఒక్క రోజు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై శుక్రవారం నుంచి జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వైయస్‌ఆర్‌ సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు, ఎంపిల భేటి అనంతరం శోభా నాగిరెడ్డి, శ్రీనివాసులు, బాబూరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ సిఎల్‌పి సమావేశానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ అధ్యక్షత వహించారు.

బిల్లు ప్రవేశపెట్టాలంటే ఆ బిల్లులో ఏయే అంశాలు ఉన్నాయో సభ్యులకు తెలియకుండా  ప్రవేశపెడితే బిల్లుపై చర్చ పూర్తిగా జరగదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉన్న డిమాండ్లు ఏమిటి, వాటిపైన సభలో చర్చించేందుకు అవకాశం ఉండదని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ తరఫున శ్రీమతి విజయమ్మగారు గట్టిగా నిలదీశారు. దీనితో శుక్రవారంనాడు బిల్లు ప్రవేశపెట్టిన తరువాత సభను వాయిదా వేసి, శని, ఆదివారాలు సభలో ఈ బిల్లుపై చర్చ జరిపేందుకు సమయం కేటాయిస్తామని ప్రభుత్వం, స్పీకర్‌ తమకు చెప్పారన్నారు. దీనితో పాటు‌ బిల్లుపై కేబినెట్ కమిటీకి ఆయా వర్గాల నుంచి ఏయే డిమాండ్లు వచ్చాయి, ఎన్ని డిమాండ్లు వచ్చాయి, వాటిలో ఎన్నింటిని అంగీకరించిందన్నది, రిపోర్టును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాము డిమాండ్‌ చేశామన్నారు. అయితే, తమ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదన్నారు.

గతంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఏ నాయకుడూ, ఏ ప్రభుత్వమూ చేయని విధంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి‌ అత్యధికంగా నిధులు కేటాయించారని, వారి అభివృద్ధికి కృషిచేశారని గురువారం జరిగిన వైయస్ఆర్‌ సిఎల్‌పి సమావేశంలో చర్చకు వచ్చినట్లు శోభా నాగిరెడ్డి తెలిపారు. అందుకే ఆయా వర్గాలు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నాయన్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీలకు మరింత ఎక్కువ మేలు ఏవిధంగా చేయాలన్న అంశంపై తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.

పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టబద్ధత కోసం అసెంబ్లీని సమావేశ పరచేందుకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఆహ్వానించారు. అయితే, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పత్రికలలో ప్రచారానికే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ ఏ విధంగా చట్టబద్ధత కల్పిస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. తూతూ మంత్రంగా కాకుండా పారదర్శకంగా చర్చ నిర్వహించాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను నోడల్‌ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిధులను ఆ ఏజెన్సీ ద్వారానే ‌కేటాయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై చర్చించడానికి మూడు రోజుల సరిపోవన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌ కూడా పాల్గొన్నారు.

Back to Top