సీఎం కిరణ్‌ అసమర్థ పరిపాలన

హైదరాబాద్, 25 నవంబర్ 2013 :

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనపై వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ సీఈసీ సభ్యురాలు, అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి మూడేళ్ళ పాలన అసమర్థంగా, తొమ్మిదేళ్ళ చంద్రబాబు నాయుడి దుష్పరిపాలనకు కొనసాగింపుగా ఉందని విమర్శించారు. ఈ మూడేళ్ళలో తెలుగు ప్రజలకు కిరణ్ ఏ‌మి చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. ఢిల్లీ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని విడగొట్టే పనిలో చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి బిజీగా ఉన్నారని రోజా విమర్శించారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో సువర్ణయుగం నడిచిందని అన్నారు.

వైయస్ఆర్‌ పథకాలకు నీళ్ళు :
మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చడం లేదా నీరుగార్చారే కానీ ఒక్క‌ దాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని రోజా ఆరోపించారు. ప్రచారానికి పెట్టిన ఖర్చులో ఒక్క శాతమైనా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టామంటూ.. సీఎం కిరణ్ ప్రకటనలు‌ చేయడం సిగ్గుచేటు అని రోజా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మాటలను ఆయన భార్య కూడా ఒప్పుకోరని రోజా అన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మూడేళ్ళను ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికి, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికి మాత్రమే సరిపెట్టారని రోజా దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సాధించింది ఏదైనా ఉందంటే అది విద్యుత్‌, బస్సు ఛార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలను పెంచడమే అని ఆమె ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే అనేక వ్యాధులను తొలగించడం ద్వారా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సిబ్బందికి నిధులు ఇవ్వకపోవడం ద్వారా 104, 108 సేవలకు తూట్లు పొడిచారని విమర్శించారు. నిరుపేద విద్యార్థులకు అనవసర నిబంధనలు పెట్టి ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారని తూర్పారపట్టారు.

వృద్ధులు, వితంతువుల పేర్లను పింఛన్‌ జాబితా నుంచి తొలగించడం ద్వారా వారిని సీఎం కిరణ్ తీవ్ర ఇబ్బందుల పాలు‌ చేశారని రోజా ఆరోపించారు. బలహీన వర్గాలకు ఆయన ఒక్క కొత్త పక్కా ఇల్లు నిర్మించలేదని, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇళ్ళను కూడా పూర్తిచేయలేదని నిప్పులు చెరిగారు. కిలో రూపాయి బియ్యం పథకాన్ని 10 కేజీలకు పెంచుతామని ఆయన ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని రోజా గుర్తుచేశారు. దీనితో నిరుపేదలు తమ కుటుంబానికి అవసరమైన మిగతా బియ్యాన్ని అత్యధిక ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడిని ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని రోజా ఆరోపించారు.‌ అధికారం చివరి రోజుల్లో అయినా కిరణ్ ప్రజలకు సేవ చేయాలని... లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. సమైక్యాంధ్ర చాంపియన్‌గా కిరణ్‌కుమార్‌రెడ్డి తనను తాను ఆవిష్కరించుకునేందుకు తాపత్రయపడుతున్నారని, ‌కానీ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలనే పాటిస్తున్నారని ఆరోపించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్ళకుండా రక్షించుకునేందుకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతిని, అసమర్థ పరిపాలనను ఎత్తి చూపడం లేదని, పైగా కాంగ్రెస్‌ పార్టీనే రక్షిస్తున్నారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుత అనిశ్చితికి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

Back to Top