9 న వైయస్‌ఆర్‌సిపి సబ్‌స్టేషన్ల ముట్టడి

హైదరాబాద్‌, 7 జనవరి 2013: విద్యుత్‌ సమస్యలపై ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ ఉన్న సబ్‌ స్టేషన్లను ముట్టడించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.‌ వైయస్‌ఆర్‌సిపి రాజకీయ వ్యవహారాల కమిటి (పిఎసి) సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీ తీసుకున్న పలు నిర్ణయాలను పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్‌, డి.ఎ. సోమయాజులు మీడియా సమావేశంలో వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా, బిల్లుల విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సబ్‌స్టేషన్ల ముట్టడిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు బాజిరెడ్డి సూచించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించడానికి నిరసనగా, ఆయనను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని బాజిరెడ్డి, సోమయాజులు తెలిపారు. సోమవారానికి దాదాపు 1,24,36,000 మంది సంతకాలు చేశారని వివరించారు. ఉద్యమంలా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మరింతగా స్పందన వస్తుండడంతో ఈ నెల 10 వ తేదీవరకూ తుది గడువును పొడిగించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ నెల 12న, లేదా 13న అపాయింట్‌ ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరినట్లు తెలిపారు. ఆయన అపాయింట్‌మెంట్‌ రాగాను కోటి సంతకాలను అందజేస్తామన్నారు.

కాగా, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ రెండు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించినట్లు బాజిరెడ్డి, సోమయాజులు పేర్కొన్నారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలు చెప్పనలవి కాకుండా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు కేంద్రాలు కొనడం లేదన్నారు. రైతులు పండించిన 50 లక్షల పత్తిబేళ్ళను కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) కొనుగోలు చేయాల్సి ఉండగా ఇంతవరకూ కేవలం 13 లక్షల బేళ్ళను మాత్రమే కొన్నదని సోమయాజులు వివరించారు. పత్తి పంట పండించడానికి రైతులకు క్వింటాల్‌కు రూ. 5,600 ఖర్చు వస్తోందన్నారు. అయితే, క్వింటాల్‌ పత్తికి కనీస మద్దతు ధరను రూ. 3,900గా నిర్ణయించారని ఆయన తెలిపారు. పోనీ ఆ సొమ్మయినా పత్తి రైతుకు నేరుగా ఇవ్వకుండా దళారుల ద్వారా చెల్లిస్తున్నారని అన్నారు. దీనితో పత్తిరైతులు దళారుల చేతిలో దారుణంగా మోసపోతున్నారని సోమయాజులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో దళారుల బారిన పడిన రైతులు క్వింటాలు 6 వందల రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు.

శ్రీ జగన్‌ తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను త్వరలోనే మళ్ళీ ప్రారంభిస్తారని బాజిరెడ్డి గోవర్ధన్‌, డి.ఎ. సోమయాజులు తెలిపారు. మోకాలికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీమతి షర్మిలకు వైద్యులు సూచించిన ఆరు వారాల విశ్రాంతి ఈ నెల 28తో ముగుస్తుందని వారు చెప్పారు. వైద్యుల సూచనల మేరకే శ్రీమతి షర్మిల పాదయాత్రను మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆగిన చోట నుంచే మళ్ళీ ప్రారంభిస్తారని బాజిరెడ్డి స్పష్టంచేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ముందుంటుందని సోమయాజులు తెలిపారు. పత్తి రైతుల సమస్యలపై ఇతర ఏ పార్టీ వారూ స్పందించడంలేదన్నారు. పత్తి రైతులు ఉత్పత్తి చేసినప్పటికి మద్దతు ధర అందక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని బాజిరెడ్డి, సోమయాజులు చెప్పారు. ఒక్కో రోజున మూడు లేక నాలుగు జిల్లా గురించి సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా విషయంలో జరుగుతున్న అక్రమాలను వివరించేందుకు తమ పార్టీ ప్రతినిధి బృందం సోమవారంనాడు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసి మెమొరాండం సమర్పించినట్లు తెలిపారు.

సహకార సంఘాల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన నిర్వహించకపోతున్నప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక కమిటీ ద్వారా సమీక్షించుకోవడం అవసరమని తమ పార్టీ భావించిందన్నారు.  డి.ఎ. సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్‌, డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వారు తెలిపారు.


Back to Top