శ్రీకాకుళం: నవ్యాంధ్ర నవశకం కోసం నవరత్నంలా నడిచొస్తూ.. వందలాది మందికి భవిష్యత్‌పై భరోసా ఇస్తూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు. చిన్నారుల నుంచి నడవలేని వృద్ధుల వరకు వైయస్ జగన్‌ను కలిసేందుకు ఉత్సాహం చూపించగా, ఆయన కరచాలనం కోసం, సెల్ఫీల కోసం యువతీయువకులు ఆసక్తి చూపించారు. పలాస నియోజకవర్గంలో సోమవారం వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, మహేంద్రతనయ నదిపై నిర్మి స్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల నుంచి వినతులు అధికంగా వచ్చాయి. అలాగే తిత్లీ తుపాన్ బాధితులకు నష్టపరిహారం అందలేదంటూ పలువురు బాధితులు తెలియజేశారు. ఐటీడీఏ పరి ధిలో సీఆర్టీ ఉద్యోగుల నియామకాల్లో ఏజెన్సీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆదివాసీ సంఘాల జేఏసీ నేతలు జగన్‌కు కోరారు. ఇటీవల 138 పోస్టులను రోస్టర్ విధానంతో నియామకాలు చేపట్టారని, ఇతర ఐటీడీఏల్లో లేని విధానాలను సీతంపేటలో అమలు చేస్తున్నారని వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. గిరిజనుల గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఐ.టి ట్రైనీస్ తదితర ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఆఫ్‌షోర్ నిర్మాణంలో వచ్చిన పరిహారాలను అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేశామని, ఆదుకోవాలని జగన్‌కు గోడు విన్నవించారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఎస్ ఆర్‌సిఎం చర్చి సిస్టర్స్ సోఫియా, మీరాల ఆధ్వర్యంలో జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జగన్ కేక్ కట్ చేశారు. అలాగే క్రైస్తవ సంఘ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సామాజిక సమస్యలను వివరించారు. పలాస నియోజకవర్గంలో అడుగడుగునా జననేతకు ఘన స్వాగతం లభించింది. భారీ స్వాగత ద్వారం వద్ద భారీ సంబరాలు చేశారు. మేళతాళాలు, పలు రకాల నృత్యాలు, బాణసంచా కాల్పుల మధ్య జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలాస సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. పాల్గొన్న నేతలు ప్రజాసంకల్పయాత్రలో శనివారం పలువురు రాష్ట్ర, జిల్లా పార్టీ నేతలు జగన్‌తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తమ్మినేని సీతారాం,శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాజాం, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతాడ మంజు, పాతపట్నం, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు రెడ్డి శాంతి, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, రెడ్డి నాగభూషణరావు, రాష్ట్ర పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి గెడ్డం ఉమ, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్(బాబా), మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దువ్వాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.