నిరంతర శ్రామికుడు వైవీ

గిద్దలూరు: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిరంతర శ్రామికుడిగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పనిచేస్తున్నారని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి అన్నారు. వై.వి.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలపై మూడేళ్ల ప్రజా ప్రస్థానం పుస్తకాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఐ.వి.రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంపీ పనిచేస్తున్నారని, ఆయన ప్రజలకందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. నియోజకవర్గంలో ఎన్నో పర్యాయాలు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నా నిరంతర శ్రామికుడిగా పనిచేస్తూ ఉక్కు మనిషికి ప్రతి రూపం మంచి మనిషికి నిదర్శనంగా నిలిచారన్నారు. పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరించేందుకు కేంద్ర మంత్రితో మాట్లాడి కేంద్ర బృందం జిల్లాలో పర్యటించేలా చేశారని, డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పోరాడారన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని, త్వరలో రాచర్ల, అర్ధవీడు మండలాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. కొమరోలు మండలంలోని దద్దవాడను దత్తత తీసుకుని తన నిధులు మంజూరు చేస్తున్నాడని, అక్కడ అధికార పక్షంలో ఉన్న నాయకులు సహకరించకపోవడం వలన నిధులు వృథాగా మారుతున్నాయన్నారు. రోడ్లు, తాగునీటి సమస్య, రైల్వే సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నాడని, జిల్లాకు తలమానికలా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిత్యం అధికారులతో చర్చిస్తున్నారన్నారు. త్వరలో నిరసన కార్యక్రమాలు చేపట్టి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. ఇంతటి సేవలందిస్తున్న ఎంపీని తిరిగి పార్లమెంటుకు పంపించి జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మూడేళ్ల ప్రజా ప్రస్థానంలో చేపట్టిన కార్యక్రమాల పుస్తకాన్ని నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సి.హెచ్‌.రంగారెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చెన్ను విజయ, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సగినాల సాయిలు, బేస్తవారిపేట, కంభం మండల కన్వీనర్లు బొల్లా బాలిరెడ్డి, రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తకోట మాజీ సర్పంచి శీలం బాలంకిరెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా కార్యదర్శి పటాన్‌ జప్రుల్లాఖాన్, ఐటీ విభాగం జిల్లా కార్యదర్శి చల్లా అశోక్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top