'యుపిఎకి అనుకూలంగా లేరనే జగన్‌పై కక్ష'

హైదరాబా‌ద్: ‌యుపిఎ ప్రభుత్వానికి, సోనియాగాంధీకి అనుకూలంగా లేనందు వల్లే వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని పార్టీ కేంద్ర పాలక మండలి  సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆయన బుధవారంనాడు ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఆ తరువాత జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేతపై కక్ష సాధించేందుకే ప్రభుత్వం కుట్ర పన్ని అసత్య ఆరోపణలు చేసి, సిబిఐని వాడుకుని జైలులో పెట్టించిందని ఆరోపించారు. చివరికి జైలులో కూడా ఆయనను వేధించేందుకే సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ములాఖత్‌లను పర్యవేక్షిస్తోందన్నారు. ఆయనను ఎవరూ కలవకుండా ఇబ్బందులు పెడుతోందని బాజిరెడ్డి మండిపడ్డారు. దేశంలో చాలా మంది నాయకులపై సిబిఐ విచారణలు, ఆరోపణలు ఉన్నప్పటికీ యుపిఎ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందునే వారిని పట్టించుకోవడంలేదని విమర్శించారు.

కానీ ప్రజల మేలు కోరే శ్రీ జగన్మోహన్‌రెడ్డి యుపిఎకు అనుకూలంగా లేనందుకే ఆయనకు బెయిల్‌ కూడా రాకుండా అడ్డుపడుతున్నారని బాజిరెడ్డి నిప్పులు చెరిగారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడుకు శ్రీ జగన్‌ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన యనమల‌ మహానేత డాక్టర్ వై‌యస్ కుటుంబంపై కక్ష గట్టి జైలు అధికారుల కా‌ల్ జాబితా, శ్రీ జగ‌‌న్‌కు సౌకర్యాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. వస్తున్నా.. మీకోసం యాత్రలో చంద్రబాబు ప్రజా సమస్యలపై కాకుండా తన సమస్యలను ప్రజలకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీ లేని సిఎం కిరణ్ ఇందిరమ్మ బాటతోను, చంద్రబాబు ‘వస్తున్నా.. మీకోసం’తో రాజకీయంగా లబ్ధి పొందేందాలని ఎత్తులు వేస్తున్నారని బాజిరెడ్డి ఆరోపించారు.
Back to Top