మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు దగా

 మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఫైర్‌

విజయవాడ: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని, నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంబమూర్తి రోడ్డులోని వేముల కూర్మయ్య విగ్రహం నుంచి ధర్నాచౌక్‌ వరకు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. ‘మెగా డీఎస్సీ’ అని చెప్పి నిరుద్యోగులను ‘దగా డీఎస్సీ’తో మోసం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తినా ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదన్నారు.

డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ నారా లోకేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిగా విడుదల చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులు, యువత, నిరుద్యోగుల హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని వెలంపల్లి స్పష్టం చేశారు.

 

Back to Top