వైయస్ఆర్‌సీపీకి 110 నుంచి 125 స్థానాలు

హైదరాబాద్:

సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ 110 నుంచి 125 శాసనసభ, 20కి పైగా లోక్‌సభ స్థానాలను ఖాయంగా గెల్చుకుంటుందని వైయస్ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7న పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిపై తమ పార్టీ అంతర్గతంగా ‘ఎగ్జి‌ట్ పోల్’ సర్వే నిర్వహించిందని, దాని ప్రకారమే తమకు వచ్చే స్థానాల సంఖ్యపై ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నామని అన్నారు. తమ అంచనా నూటికి నూరు శాతం నిజం అవుతుందని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ‌మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా తీర్పును శిరసావహించక తప్పదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తాము కూడా అంగీకరిస్తున్నామని మైసూరారెడ్డి అన్నారు. అయితే స్థానిక ఎన్నికలపై పూర్తిగా స్థానిక  పరిస్థితులు, స్థానిక నాయకత్వం తీరు తెన్నులు ప్రభావం చూపుతాయని, పైగా ఎన్నికలు జరిగేది కూడా తక్కువ ఓట్ల పరిధిలోనే అని ఆయన చెప్పారు. ఒక ఎంపీటీసీ అంటే 2 వేల ఓట్ల లోపే ఉంటాయని, ఇందులో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. అయితే స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మధ్య అనేక రాజకీయ పరిణామాలు, సమీకరణలు చోటుచేసుకున్నాయని, ఇవన్నీ ఓటర్ల దృక్పథంలో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు.

స్థానిక ఓట్ల శాతంలో తేడా స్వల్పం :
వైయస్ఆర్‌సీపీ కొత్త పార్టీ అనీ, అయినప్పటికీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి దీటుగా నిలబడగలిగిందని మైసూరారెడ్డి అన్నారు. తమ పార్టీ కొంత వెనుకబడినా టీడీపీతో పోల్చితే తేడా చాలా స్వల్పమే అన్నారు. తమ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కన్నా 4 శాతం, మండల, జడ్పీ ఎన్నికల్లో 3.07 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని ఆయన గణాంకా‌లు వివరించారు. కొన్ని జిల్లాల్లో ఆ తేడా మరింత తక్కువగా ఉందన్నారు.

Back to Top