రైతుల‌కు అండ‌గా వైయ‌స్ఆర్ సీపీ

కోరుకొండ : మండల కేంద్రమైన కోరుకొండ రైతులు , ప్రజల భూములకు రిజిస్ట్రేషన్లు జరుపుకునేందుకు ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి వారిని  జక్కంపూడి విజయలక్ష్మి ద‌ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కోరుకొండ రైతు సేవాసమితి నాయకులు, కోరుకొండ, కాపవరం, శ్రీరంగపట్నం, పశ్చిమగానుగూడెం, జంబూపట్నం తదితర గ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ల సమస్యను జక్కంపూడి విజయలక్ష్మికి వివ‌రించారు. అన్నవరం దేవస్థానం ఈఓ కోరుకొండ గ్రామంలో ఉన్న సూమారుగా 1180 ఎకరాల పొలాలు, ఇండ్ల స్థ‌లాలు, ఇళ్లకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయించారని బాధితులు ఆమె వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండున్నర‌ సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికార పార్టీ నేతలు, దేవాదాయశాఖ అధికారులు, వివిధ‌ పార్టీల నేతలకు తమగోడు వివరించినా ప‌ట్టించుకోలేద‌న్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని జక్కంపూడి విజయలక్ష్మికి పలుగ్రామాల వాసులు మొర‌పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. కోరుకొండలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరిగేంతవరకు వైయ‌స్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు స్పందించి రైతులు, ప్రజలకు న్యాయం చేయాలన్నారు. రైతులు, ప్రజలు కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని విజయలక్ష్మి అన్నారు.  కార్యక్రమంలో వైయ‌స్సార్ సీపీ మండల కన్వినర్ వుల్లి బుజ్జిబాబు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సేవాసమితి నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top