కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు

హైదరాబాద్, 5 నవంబర్ 2013:

ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడాన్ని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తీవ్రంగా ఖండించింది. సామాన్యుడిపై అత్యధికంగా రూ. 600 కోట్ల ఆర్థిక భారం పడేలా చార్జీలు పెంచడం దారుణమని దుయ్యబట్టింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి. జనక్ ప్రసా‌ద్ ధ్వజమెత్తారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రోశయ్య ప్రభుత్వం ఒకసారి ఛార్జీలు వడ్డించారని, కిర‌ణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో నాలుగు సార్లు అంటే మొత్తం ఏడాదికి ఒకసారి అన్నట్టుగా ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని జనక్‌ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

‌దివంగత సీఎం వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల‌ను విజయవంతంగా అమలు చేశారని జనక్‌ ప్రసాద్ గుర్తుచేశారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి అభివృద్ధిని మరిచిపోయారని, సంక్షేమ పథకాలను ఒకటొకటి తగ్గిస్తూ.. బలహీన పరిచారని విమర్శించారు. మహానేత మరణం తరువాత ఆర్టీసీ మీద ఈ ప్రభుత్వం రూ. 2,300 కోట్లు పన్ను వేసిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.

చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో ఐదుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని జనక్‌ ప్రసాద్‌ ప్రస్తావించారు. బాబు అడుగుజాడల్లోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు-2 పాలనను ప్రజలకు కిర‌ణ్ కుమా‌ర్‌రెడ్డి అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రె‌స్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని జనక్ ప్రసా‌ద్ అన్నారు. గ్రామాలకు వెళ్ళే పల్లెవెలుగు బస్సులకు ఛార్జీలు పెంచిన వైనాన్ని ఆయన తప్పుపట్టారు. సిటీ బస్సు పాస్‌ ఛార్జీలను కూడా పెంచడాన్ని ఆయన ప్రశ్నించారు.

ప్రైవేటు బస్సులకు తక్కువ... ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ బస్సులకు ఎక్కువ పన్నులు వేసే విధానం ఏమిటని జనక్‌ ప్రసాద్‌ నిలదీశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి, కార్మికులను రోడ్డున పడవేసి, సంస్థను ప్రైవేటుకు అమ్మేయాలని ప్రభుత్వం చూస్తోందా? అని ప్రశ్నించారు. ఇదేమి ప్రభుత్వం, ప్రజలను ఏ విధంగా పరిపాలించాలనుకుంటున్నదని నిలదీశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బస్సు భవన్‌ వద్ద మంగళవారమే ధర్నా నిర్వహించిందని జనక్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తున్నదో ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

మహానేత రాజశేఖరరెడ్డిగారు ఎప్పుడూ విద్యుత్‌ చార్జీలు పెంచననలేదని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను జనక్‌ ప్రసాద్‌ తిప్పికొట్టారు. వచ్చే ఐదేళ్ళూ ఛార్జీలు పెంచేది లేదని వైయస్ఆర్‌ చెప్పినట్లు వచ్చిన వార్తను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సాక్ష్యాన్ని చూసి అయినా బొత్స, కిరణ్‌కుమార్‌రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

Back to Top