సమైక్య ఉద్యమ ఉద్ధృతికి వైయస్ఆర్సీ హామీ

హైదరాబాద్ 01 నవంబర్ 2013:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వీలుగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ సంసిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో పార్టీ ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి శుక్రవారం ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని మరోసారి ప్రకటించారు. కొందరు స్వార్థపరులు రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని విభజించి, తెలుగు ప్రజల మధ్య అంతరాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పొట్టి శ్రీరాములు వంటి ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమైందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలుగా కోయాలని చూస్తున్న వారి యత్నాలను ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిపారు. అభివృద్ధిలో మన రాష్ట్రం ఇప్పటికే మూడో స్థానం నుంచి 15వ స్థానానికి దిగజారిపోయిందన్నారు. విభజన ప్రక్రియ దీనికి కారణమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యగా ఉంచడానికి పనికొచ్చే ఏ అంశాన్నీ తమ పార్టీ విడిచిపెట్టదని శోభానాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు సమైక్యంగా ఉంచడానికే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం 15, 16 సీట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారనీ, ఆమెకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనీ ఆమె పేర్కొన్నారు.

విజయమ్మ అరెస్టుకు ఖండన
నల్గొండ జిల్లాలోని ముంపు ప్రాంతాలలో పర్యటించేందుకు వస్తున్న  వైయస్ఆర్సీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను పోలీసులు ఖమ్మం-నల్గొండ జిల్లా సరిహద్దులో అడ్డుకుని అరెస్టు చేయడాన్ని శోభా నాగిరెడ్డి ఖండించారు. తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న పార్టీ గౌరవాధ్యక్షురాల్ని ఏ విధంగా అరెస్టు చేయిస్తారని ప్రశ్నించారు. హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన చేతిలోనే ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తాము రాష్ట్రం మొత్తానికి మంత్రులుగా గుర్తుంచుకోవాలని ఆమె జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు శోభా నాగిరెడ్డి హితవు పలికారు. ముంపు ప్రాంతాలలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. కొంతమంది వ్యక్తులే శ్రీమతి విజయమ్మ పర్యటనకు అడ్డుపడ్డారు తప్ప ప్రజలు కాదే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. సమైక్యవాదులను కాపాడుకుంటామన్న మీ హామీ ఏమైందని ఆమె జానారెడ్డిని ప్రశ్నించారు.

Back to Top