ధరలపై దద్దరిల్లిన విశాఖ..వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్

విశాఖపట్నం : నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ....విశాఖ కలెక్టరేట్ వద్ద  వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ధరలు మండిపోతున్నా వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 

ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వతీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈక్రమంలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. ధర్నా విజయవంతం కాకుండా ఎక్కడికక్కడ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహిస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకొన్నారు.  జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. 

మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌లతో సహా 400 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షాల నోరునొక్కడంపై నాయకులు మండిపడుతున్నారు. 
Back to Top