ప్రజా గర్జన కాదది.. బాబు పిల్లికూతలు

హైదరాబాద్, 29 డిసెంబర్ 2013:

తిరుపతి ప్రజా గర్జన సభలో చంద్రబాబు ప్రసంగాన్ని విన్న తరువాత ఆయనకు ఓట్లు, అధికారం యావ ఎంతగా తలకెక్కిపోయిందో అర్థమైందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌ విమర్శించారు. సమైక్యానికి మద్దతు ప్రకటించమని ప్రజలు కోరుతుంటే.. ఇప్పుడాయన గర్జనలు, గాండ్రింపులు చేయడం ఎందుకని వారు ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రాత్రి వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుది సమైక్య గర్జనా? లేక విభజన గర్జనా? అని ఎందుకు స్పష్టం చేయలేకపోయారని నిలదీశారు. చంద్రబాబు గంటన్నరకుపైగా ఉపన్యసించినా.. ఎక్కడా ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీని, ఇతరులను దూషిస్తున్న చంద్రబాబు.. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయన ఇచ్చిన లేఖ సంగతేంటి? అని నిలదీశారు.

ఈ రాష్ట్రం విడిపోవాలని చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నారని పద్మ, రాజేశ్‌ నిలదీశారు. విభజన లేఖ వెనక్కి తీసుకుంటానని ఇప్పటికీ ఎందుకు చెప్పడంలేదని అన్నారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారే గాని వారికి తాను చేసిన అన్యాయం గురించి ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు అన్నారు. తెలంగాణ కూడా నష్టపోకుండా ఉండాలంటే.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని బాబు ఎందుకు చెప్పడం లేదని అడిగారు. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లును చంద్రబాబు తప్పుపడుతున్నారే గాని విభజనను మాత్రం ఆయన వ్యతిరేకించడంలేదన్నారు. చంద్రబాబు విభజన రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పొగిడి, తన తొమ్మొదేళ్ళ పాలనను తిరిగి తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబు చేయలేదని వాసిరెడ్డి పద్మ, మద్దాల రాజేశ్‌ ఎద్దేవా చేశారు. తన పాలనను మళ్ళీ తెస్తానంటే ప్రజలంతా పారిపోతారు కాబట్టి ఆ మాట చెప్పలేదన్నారు. రెండు కళ్ళు, కొబ్బరి చిప్పలు అన్న చంద్రబాబు తిరుపతి ప్రజా గర్జన సభలో తెలుగు ప్రజలను రెండు కోతులతో పోల్చడాన్ని వారు తప్పుపట్టారు.

పచ్చి అవకాశవాది చంద్రబాబు:

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు నరేంద్ర మోడి రావడానికి ససేమిరా అన్న నోటితోనే ఇప్పుడు ఆయనను ఎంతగానో పొగుడుతున్నారని పద్మ, రాజేశ్‌ విమర్శించారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని ఇది చాటి చెబుతోందన్నారు.

రైతు బిడ్డని అని చెప్పకుంటున్న చంద్రబాబు తన హయాంలో రైతుకు ఎలాంటి మేలూ చేయని విషయాన్ని గుర్తుచేశారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు రైతులకు ఒక్కరోజైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ఒక్క ప్రాజెక్టయినా నిర్మించారా? పంట రుణాల గురించి మాట్లాడుతున్న ‌చంద్రబాబు తన హయాంలో కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెరగలేదన‌డం, 24 గంటలపాటు విద్యుత్ ఇచ్చానని చెప్పడం సిగ్గుచేలు అన్నారు‌.

ప్రజా గర్జన సభలో చంద్రబాబు ఎంతసేపూ తనను గెలిపించండి అని ప్రాధేయపడడమే కనిపించిందని వాసిరెడ్డి, మద్దాల అన్నారు. ఏడుపులు, పెడబొబ్బలు, పిల్లికూతలు తప్ప ప్రజా గర్జనలో ప్రజలకు ఒనగూరే ప్రయోజనం గురించి ఏదీ ప్రస్తావించని వైనాన్ని వారు ఎండగట్టారు. ఈ సభ ద్వారా ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకిని ఓట్లు దండుకోవాలనుకుంటున్నారని చెప్పారు. సమైక్యం అనే చిన్న మాట చంద్రబాబు అని ఉంటే.. ప్రజా గర్జనలో హర్షామోదాలు వ్యక్తం అయి ఉండేవన్నారు.

తిరుపతిలో ఒకవైపున ప్రజా గర్జన నిర్వహించిన చంద్రబాబు... మరో పక్కన తెలంగాణను త్వరగా ఇవ్వాలని కోరమని ఇదే రోజున టీటీడీపీ నేతలను రాష్ట్రపతి వద్దకు పంపడం ఆయన రెండు కళ్ళ సిద్ధాంతానికి ప్రబల నిదర్శనం అన్నారు. టీడీపీ నాయకులను తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలవారీగా చీల్చింది చంద్రబాబే అన్నారు.

నారా చక్రవర్తి చిడతలు : రాజేశ్‌:
సమైక్యాంధ్ర గురించి చంద్రబాబు ఒక్క మాట అనలేదని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌ అన్నారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించిన చందంగా.. ప్రజా గర్జన సభలో నారా చక్రవర్తి చిడతలు వాయించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబువన్నీ అబద్ధపు వ్యాఖ్యలే అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలైపోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడిని ఆ రోజున ఎందుకు రక్షించానా అని ఆ ఏడుకొండలవాడు బాధపడుతున్నాడని అన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలపకుండా పారిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకోవాలని సూచించారు. క్వార్టర్‌ మద్యం సీసా, వంద నోటు గురించి చంద్రబాబు మాట్లాడడం శోచనీయం అన్నారు. మన రాష్ట్రంలో బెల్టు షాపులను విచ్చలవిడిగా పెట్టింది తానే అని చంద్రబాబు మరిచారా?అని రాజేశ్‌ ప్రశ్నించారు.

ఒసామా బిన్‌ లాడెన్‌ బ్రతికి వచ్చి ఉగ్రవాదులను అంతమొందిస్తానని చెబితే ఎలా ఉంటుందో.. అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఆ అవినీతిని పారదోలతాను అనడం అలాగే ఉందని రాజేశ్ ఎద్దేవా చే‌శారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top