బంగారు తెలంగాణా అంటే రైతుల ఆత్మహత్యలేనా?

హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలేనా అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రశ్నించారు.సోమవారం లోటస్ పాండ్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో శివకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. దివంగత నేత వైఎస్సార్ పాలనలో రైతులు చనిపోతే ప్రభుత్వ రికార్డులోకి ఎక్కించి రూ.2 లక్షలు సాయంగా వెంటనే అందజేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు  కేసీఆర్ బంగారు పాలనలో రోజుకు ఇద్దరు, లేదా ముగ్గురు వంతున రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే సత్తాటీఆర్‌ఎస్‌కు లేదన్నారు.

నష్టాలపై సర్వే చేయించండి
తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారని, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయికి బృందాలను పంపాలని శివకుమార్ ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకపోతే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆందోళనలు చేపడతామన్నారు.


2న రాష్ట్ర కార్యవర్గ సమావేశం..
మే 2న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉదయం 10 గంటలకు లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పాల్గొనాలని కోరారు. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలపై చర్చ ఉంటుందన్నారు.
Back to Top