జేసీ దివాకర్‌రెడ్డి మనిషా? పశువా?



– జేసీ లాంటి వ్యక్తులు ఉండబట్టే నేతలకు విలువలు లేకుండాపోయాయి
– జేసీ ప్రవర్తన పశువుల కంటే హీనంగా ఉంది
– ఆ జీవో ఇచ్చింది అశోక్‌గజపతిరాజు కాదా?
– టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– విశాఖ రైల్వే జోన్‌పై నాలుగేళ్లు ఏం చేశారు? 
– టీడీపీ అవినీతి చరిత్ర అంతా తెలుసు
– ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెడతారు
హైదరాబాద్‌: టీడీపీ నేతలు సభ్యత, సంస్కారాన్ని మరచి మాట్లాడుతున్నారని, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మనిషా? పశువా? అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నాయకుల వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ ఖండించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు ఇవాళ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టును ఆరు నెలల్లో పరిశీలించి, ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందుపరిచారన్నారు. ఆరు నెలల సమయంలో సాధ్యాసాధ్యాలు గుర్తించాలని చట్టంలో పెడితే..నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేసి ఏం ఒరగబెట్టారని సూటీగా ప్రశ్నించారు. మీ అవినీతి కార్యక్రమాల కోసం కాలయాపన చేసి..ఇవాళ దీక్షలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్‌ కావాలని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ జిల్లావ్యాప్తంగా పాదయాత్ర చేశారన్నారు. మేం ఉద్యమిస్తే..ఆ నాడు టీడీపీ ప్రభుత్వం హేళన చేసిందన్నారు. దీక్షల పట్ల చులకనగా మాట్లాడారని, ఉద్యమించిన వారిపై కేసులు పెట్టారన్నారు. ఉక్కులేదు..తుక్కు లేదని మాట్లాడిన నాయకులు ఏం ముఖం పెట్టుకొని విశాఖలో ఇవాళ దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మీకు దమ్ముంటే ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంటి ముందు, రైల్వే మంత్రి ఇంటి వద్ద ధర్నాలు చేయాలని సవాల్‌ విసిరారు. ఎంపీలుగా కొనసాగుతున్న పెద్ద మనుషులు విశాఖలో ఏం చేస్తారని, ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాలని సూచించారు. టీడీపీ నాయకులు మొదట రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలు ఇటీవల ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడారన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి మనిషేనా? పశువా అని ఫైర్‌ అయ్యారు. హుందా తనం లేకుండా, నోరు ఉందని రెండక్షరాలు మాట్లాడితే గొప్పతనం అవుతుందా అన్నారు. సంస్కారం ఉన్న మనిషిలా మాట్లాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకవచనంతో వాడు, వీడు అని మాట్లాడటం దుర్మార్గమన్నారు. జేసీ లాంటి వ్యక్తులు ఉండబట్టే రాజకీయాలు భ్రష్టుపట్టాయన్నారు. చంద్రబాబు పాదాలు కడిగి నీ తలపై పోసుకుంటే ఎవరు వద్దనరని, ఇతరులను ఇష్టంవచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. మనిషికి వయసు వస్తే సరిపోదని, బు్రర కూడా పెరగాలన్నారు. ఇలాంటి మాటలకు ఫుల్‌ స్టాప్‌ ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నానన్నారు. సభ్యత, సంస్కారంతో మనం ప్రవర్తించాలని హితవు పలికారు.
– అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలు సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టారని, మీ వద్ద ఆధారాలు ఉంటే న్యాయపోరాటం చేయాలని కానీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మీ మాదిరిగా వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి వైయస్‌ జగన్‌ కాదన్నారు. విమానాయానశాఖలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందన్నారు. ఓ ప్రైవేట్‌ సంస్థకు మేలు చేసేందుకు చంద్రబాబుతో కుమ్మకైంది వాస్తవం కాదా అన్నారు. నిబంధనలు మార్చి జీవో ఇచ్చింది మీరు కాదా అని అశోక్‌గజపతిరాజును నిలదీశారు. 
– విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించలేని దద్దమ్మలు టీడీపీ నేతలని బొత్స సత్యనారాయణ విమర్శించారు. చేతకాని వారు ఇవాళ మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు ఎప్పుడైనా కేబినెట్‌ మీటింగ్‌లో రైల్వేజోన్‌ గురించి మాట్లాడారా అని నిలదీశారు. 20 మంది ఎంపీలున్నా టీడీపీ నేతలు కేంద్రాన్ని ఏమీ  అడగలేకపోయారని, వీరికి 25 ఎంపీ స్థానాలు ఇవ్వాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరా నీతిమంతులని ప్రశ్నించారు. నీతిమంతులైతే విమాన శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్రానికి లేఖ రాయగలరా అని అశోక్‌గజపతిరాజుకు సవాల్‌ విసిరారు. ఇంకా టీడీపీకి ఆరు నెలలే సమయం ఉందని, మీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. రాజ్యాంగానికి కట్టుబడి వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ వేదికగా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విశాఖకు కేంద్రం రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే అని డిమాండు చేశారు. కేంద్రం మెడలు వచ్చి రైల్వే జోన్‌ సాధిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 
 
Back to Top