<strong>చంద్రబాబుపై వైయస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి ఫైర్</strong>గుంటూరు: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మారిపోతే విపరీతమైన అవినీతితో చంద్రబాబు ధనిక సీఎంగా మారిపోయారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రత్యేక హోదానే ఎజెండా అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపాలనను అంతం చేయడమే లక్ష్యమన్నారు. ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేటలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బీసీల అభివృద్ధి జరిగిందన్నారు. 600లకుపైగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యాడన్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకొని ప్రచారాలు చేసుకున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసం చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. <br/>బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేటలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. స్థానిక కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ ధర్నాలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. పార్టీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని సీట్లు మారుస్తున్నారంటూ గిట్టనివారు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు కేవలం రూ.13 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. 11 ఫెడరేషన్ల తరపున బీసీలకు అందాల్సిన రుణాలు అర్హులకు చేరడంలేదన్నారు. రజిని మాట్లాడుతూ టీడీపీ గత ఎన్నికల సమయంలో బీసీలకిచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. 20న ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుందన్నారు. <br/>