‘వంచనపై వైయస్‌ఆర్‌ సీపీ గర్జన’

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపు

విశాఖపట్నం: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడం, సాధించడంలో విఫలమైన బీజేపీ, టీడీపీలపై వైయస్‌ఆర్‌ సీపీ మరో పోరుకు సిద్ధమైంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం  అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. పార్టీ అ«ధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘వంచనపై గర్జన’ పాదయాత్రలు చేపట్టనున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మండల కేంద్రాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 

సంఘీభావ పాదయాత్రకు అపూర్వ స్పందన

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకు విశాఖ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అమర్‌నాథ్‌ చెప్పారు. విశాఖలో దాదాపు 8 రోజుల పాటు పాదయాత్ర పెద్ద ఎత్తున సాగిందని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. విజయసాయిరెడ్డికి ప్రజలు అనేక సమస్యలను వివరించారని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారన్నారు. 14, 15 తేదీల్లో విశాఖ సౌత్‌ నియోజకవర్గాల్లో విజయసాయిరెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. సిటీలోని నాలుగు నియోజకవర్గాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు పాదయాత్రలో పాల్గొంటారన్నారు. అదే విధంగా 16వ తేదీన విశాఖ మహిళా కళాశాల సమీపంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. సభ అనంతరం పార్టీ నేతలంతా పాదయాత్రగా కలెక్టరేట్‌కు తరలివెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వంచనపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో, విశాఖలో జరిగే సంఘీభావ పాదయాత్రను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. 
Back to Top