ప్రతిపక్షంపై టీడీపీ ఎదురుదాడి

హైదరాబాద్: టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కాల్ మనీ కేసుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది.  రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇంత దారుణమైన విషయంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం దారుణమని, దీనిపై చర్చించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. అయితే, ప్రభుత్వం ఈ అంశంపై రేపు ప్రకటన చేస్తుందని, అప్పుడు విస్తృతంగా చర్చించుకోవచ్చని యనమల రామకృష్ణుడు తప్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో చంద్రబాబు, డీజీలు దోషులతో ఉన్న ఫొటోలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చూపించారు. 'కాల్ మనీ చంద్రబాబు డౌన్ డౌన్' అంటూ సభ్యులు నినాదాలు చేశారు. చర్చ చేపట్టాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. 


వాయిదా తీర్మానం తిరస్కరణపై వైఎస్సార్సీపీ  సభ్యులందరూ నినాదాలు చేస్తూ  స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే, నిరసనల మధ్యే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేచి, వైఎస్సార్సీపీ  నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు ప్రారంభించారు. కాల్‌మనీ వ్యవహారంలో వైఎస్సార్సీపీ  నేతలు ఉన్నారని బురదజల్లే ప్రయత్నం చేశారు. టీడీపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ..మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శలకు దిగారు.  చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అండ్ కో ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా  సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారు. 
Back to Top