ప్రచారాలు, ఆర్భాటాలే తప్ప ఆదరణ కరువు

మాటలు చెప్పడం కాదు చేసి చూపండి
కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగడం లేదు
బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం

కుండపోత వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తుఫాన్ కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం వల్లే తీవ్ర నష్టం జరిగిందని బొత్స విమర్శించారు. ఆర్భాటాలు, ప్రచారాల కోసం అధికారులను తిడుతూ నిందలు వేస్తున్నారు తప్పితే...చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ కూడా బాధితులను ఆదుకోవడం లేదన్నారు. 

తుఫాన్ వస్తుందని ముందే తెలిసి కూడా ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిత్యవసర వస్తువులు ఎందుకు అందుబాటులో ఉంచలేదని బొత్స ప్రశ్నించారు. రేషన్ డిపోలో ఉప్పు లేదు, పప్పు లేదంటూ అధికారులను అదమాయిస్తున్న మంత్రులు...ముందస్తుగా ఎక్కడైనా సమీక్ష నిర్వహించారా అని నిలదీశారు. ఆయా ప్రదేశాల్లో అధికారులకు ఆదేశాలిచ్చారా..? పర్యవేక్షణ చేయమని చెప్పారా..? అని బొత్స ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి, మంత్రులు మాటలు మాని బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

తమిళనాడుకు కేంద్రం రూ.939 కోట్లు కేటాయించిందని..కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి కూడా చంద్రబాబు నిధులు ఎందుకు తీసుకురావడం లేదని బొత్స ప్రశ్నించారు. భాగస్వామ్యంలో వైషమ్యాలు ఉంటే పక్కనబెట్టి ..బాధితులను  ఉదారభావంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జనం ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు మలేషియా, చైనా వాళ్లతో మీటింగ్ ల్లో మునిగితేలుతున్నారని బొత్స విమర్శించారు.ఇక  హుద్ హుద్ తుఫాన్  సహాయార్థం  కేంద్రం రూ.1000 కోట్లు ప్రకటించినా, లెక్కల్లో రూ. 150 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు.

అధిక వర్షాల వల్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  పంటలు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని...ప్రభుత్వ మద్దతు ధరకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. రైతుల పట్ల చంద్రబాబు చిన్నచూపు చూడడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్రంలో ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని బొత్స దుయ్యబట్టారు.

Back to Top