‌సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి వైయస్ జగనే

నెల్లూరు :

సమైక్యాంధ్రప్రదేశ్‌కు యువనేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమాగా చెప్పారు. సీనియర్ కాంగ్రె‌స్ ‌నాయకుడు, మాజీ మంత్రి పసల పెంచలయ్య నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తన నివాసంలో ఆదివారం మేకపాటి ఆధ్వర్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పెంచలయ్యకు మేకపాటి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మేకపాటి మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం తపించే నాయకులకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల నాయుడిగా అంచెలంచెలుగా ఎదిగిన పెంచలయ్య పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పటిష్టమైన నాయకత్వ లక్షణాలతో మంత్రిగా, ఎంపీగా పెంచలయ్య  చేసిన సేవలు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయాయన్నారు.

అధికారమే పరమావధిగా కేంద్రప్రభుత్వం తెలుగు గడ్డను చీల్చేందుకు కుటిలయత్నం చేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు అన్ని విధాలా పోరాడతామని మేకపాటి అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం, విభజన వల్ల తలెత్తే సమస్యల తీవ్రతను రాష్ట్రపతికి వివరించడం, అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించడం లాంటి అవకాశాలతో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు. మహానేత వైయస్ఆర్ హయాంలో ప్రజలు సువర్ణయు‌గాన్ని చూశారని, యువనేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఆ రోజులు మళ్లీ వస్తాయని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ సునామీ తథ్యం : పసల
ఇచ్చాపురం నుంచి తడ వరకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయ సునామీ సృష్టించడం తథ్యమని, కుటిల రాజకీయ నాయకులు ఆ సునామీలో కొట్టుకుపోతారని మాజీ మంత్రి పసల పెంచలయ్య వ్యాఖ్యానించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన‌ డాక్టర్ వైయస్ఆర్ ఆశయాలను‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సాధిస్తారన్నారు. రాష్ట్రంలో 75 శాతం సీట్లు సాధించి శ్రీ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పటిష్టమైన నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, యువనేత పోరాటంతో ప్రజల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరిస్తాయన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడే లక్షణాలు యువనేత‌ శ్రీ జగన్‌లో ఉన్నాయని సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధ‌ర్ అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయన అకుంఠిత దీక్షతో పోరాడుతున్నారన్నారు.

పార్టీలో భారీగా చేరికలు :

పసల పెంచలయ్యతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చి వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. వీరికి ఎంపీ మేకపాటి రాజమోహ‌న్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులను మేకపాటికి ఓడూరు గిరిధర్‌రెడ్డి పరిచయం చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన పాపాటి రవీంద్రరెడ్డి పలువురు సర్పంచ్‌లతో కలిసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఓజిలి మండలంలోని పలువురు సర్పంచులు కూడా పార్టీలో చేరారు.

Back to Top