పంటలు కుళ్లిపోయినా పట్టించుకోని బాబు

  • అనంతపురం జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
  • ధర్మవరం మండలం సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్
అనంతపురంః అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతాంగం పూర్తిగా నష్టపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతులపై లేకపోవడం బాధాకరమన్నారు. ధర్మవరం మండలం సీతారాంపల్లిలో దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వైయస్ జగన్ కు ఏకరువు పెట్టారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే....

-ఈ సంవత్సరం జూన్ 1నుంచి ఆగష్టు 9దాకా రాయలసీమ జిల్లాలో 22శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఒక్క అనంతపురం  జిల్లాలోనే 30శాతం తక్కువ వర్షాపాతం.  జూలైలో 54 శాతం డెఫిషిట్ రెయిన్ ఫాల్.  

-వర్షాలు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితులు.  మిగిలియున్న కాస్తో కూస్తో పంట కూడ అకాల వర్షాలతో కుళ్లిపోయిన పరిస్థితి. నిన్నటిదాకా కరువు. ఈ పది రోజుల్లో అతివృష్టి. కరువుతో పంటలు ఎండిపోయినయి. అతివృష్టితో పంటలు కుళ్లిపోయినయి. 

-బాధాకర విషయమేమంటే...నంద్యాల, కాకినాడలో ఉపఎన్నికలు జరిగితే చంద్రబాబు క్యాబినెట్ అంతా అక్కడ తిష్టవేసింది. ఇవాళ పంటలు కుళ్లపోయినా ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. క్యాబినెట్ మీటింగ్ లో చర్చించరు. ఖరీఫ్ సీజన్ అయిపోయింది. పంటలు ఎండిపోయాయి. కరువు మండలాల కింద డిక్లేర్ చేయాలన్న ఆలోచనే వీరికి లేదు. 

-పంటలు ఎండిపోయినా, అధిక వర్షాలకు కుళ్లిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. వెంటనే వచ్చి కరువు, వర్షం వల్ల నష్టపోయిన దానికి పరిహారం ఇచ్చి  రైతులకు తోడుగా నిలవాలి. 

-ఒక్క అనంతపురంలోనే 50వేల ఎకరాల్లో వేరుశనగ, అనప, పత్తి, టమాట పంటలన్నీ పూర్తిగా కుళ్లిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నయి. కడపలో 50వేల ఎకరాలు, కర్నూలులో మరో 50వేల ఎకరాలు. చిత్తూరులో 15 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 

-అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే వచ్చి చూసే నాథుడు కూడ కరువయ్యాడు.  ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. 


Back to Top