గిరిజనులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్ భరోసా


కడప:  టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు గిరిజనులపై చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప  జిల్లా పులివెందులలో గుండెపోటుతో మృతిచెందిన కావేటి శ్రీనివాసులు కుటుంబాన్ని  ఆయన పరామర్శించారు. ఈ సమయంలో స్థానికులు మాట్లాడుతూ మూడు నెలల కిందట పులివెందులలో గిరిజనులపై టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పారు. స్పందించిన వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు.


పులివెందులలో జగన్ రెండోరోజు కూడా బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు షరీఫ్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కావేటి శ్రీనివాసులు మృతిచెందిన నేపథ్యంలో ఆయన తండ్రి జుట్టు గంగన్నను, కుటుంబ సభ్యుల్ని, మాజీ కౌన్సిలర్ గాజుల శాంతి మృతి చెందిన నేపథ్యంలో గాజుల శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బొగ్గుడుపల్లె గ్రామంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు బొగ్గుడుపల్లె ప్రభాకర్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి  తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top