<strong>హైదరాబాద్:</strong> వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు శుక్రవారం హైకోర్టు విచారించనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కేసు ఎందుకు కేంద్రానికి ఎందుకు బదిలీ చెయ్యలేదని గత విచారణలో హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెల్సిందే. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కే కేసును ఇవ్వాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణలో కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మీరు(కేంద్రం) నిర్ణయం తీసుకోలేకపోతే మేమే ఆదేశిస్తామని హైకోర్టు వ్యాఖ్యనించింది. కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ఎన్‌ఐఏకు కేసు బదిలీపై శుక్రవారం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్‌ఐఏ చేత దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇదివరకే నివేదించింది. ఈ ఘటన ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని వివరించింది కూడా. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ లోపు రాష్ట్ర పోలీసులు దర్యాప్తును కొనసాగించవచ్చునని ఇదివరకే తెలిపింది.<br/>