ఏ స్వతంత్ర సంస్థతోనైనా దర్యాప్తునకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

 

17–11–2018, శనివారం  
పార్వతీపురం పాతబస్టాండ్‌ సెంటర్, విజయనగరం జిల్లా

‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నట్లు.. తాము రాయాల్సిన పరీక్షలు సంవత్సరం పాటు ఆలస్యమవుతున్నాయని ఉదయం శిబిరం వద్ద కలిసిన డైట్‌ కాలేజీ విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. మొదటి సంవత్సరం పూర్తయినా పరీక్షలు పెట్టక.. రెండో సంవత్సరం తర్వాత రెండు పరీక్షలూ దాదాపు ఒకేసారి పెడితే.. మేమెట్లా చదవగలం.. ఏం రాయగలం.. అన్నది వారి బాధ. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల విలువైన విద్యాసంవత్సరాన్ని, ఉద్యోగావకాశాల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.  

 జగన్నాథపురం కాలనీ ప్రజలు కలిశారు. పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య అత్యధికంగా ఉందన్నారు. మూడ్రోజులకోసారి తాగునీరు రావడమూ కష్టమేనన్నారు. తాగునీరు అడిగిన ప్రజలపై నేతలు దౌర్జన్యాలు కూడా చేశారని చెబుతుంటే.. బాధేసింది. పట్టణ సుందరీకరణ ముసుగులో అధికార పార్టీ నేతలు డివైడర్ల ఏర్పాటుపేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారన్నారు. వారెంతగా బరితెగించారంటే.. పట్టణంలో ప్రవహించే వరహాలగెడ్డను కబ్జాచేసి ఓ నాయకుడు ఇల్లు కట్టుకుంటే, మరో ప్రబుద్ధుడు దాని దిశను మార్చి విలువైన స్థలాన్ని స్వాహా చేశాడట. మొత్తానికి ఈ పట్టణంలో పచ్చ నేతల నిధుల దాహం తీరుతోందే తప్ప.. ప్రజల నీటి దాహం తీరడం లేదు.   

వివేకానంద కాలనీవాసులు కలిశారు. ఒకప్పుడు తాగునీటిని అందించే గోపసాగరం చెరువును డంపింగ్‌యార్డుగా మార్చేశారని చెప్పారు. దాంతో కాలుష్యం పెరిగి దుర్గంథంతో అల్లాడిపోతున్నట్టు వివరించారు. వేలాదిమంది ప్రజలు, దగ్గర్లోని అనాథాశ్రమ బాలురు రోగాలబారిన పడుతున్నా పట్టించుకునే నాథుడేలేడన్నారు. చెరువు, నదులమీద అపార ప్రేమ ఉన్న పచ్చ నేతలకు ప్రజా సమస్యలపై పట్టింపు ఎందుకుంటుంది?! 

చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లుంది.. అగ్రిగోల్డ్‌ బాధితుల పరిస్థితి. నర్సిపురంలో వారు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టార్జితమంతా పాలక నేతలకు ఫలహారమవుతోందంటూ వాపోయారు. ఇక్కడి కొత్తవలస అనే కుగ్రామంలో 160 ఇళ్లుంటే.. 280 అగ్రిగోల్డ్‌ పాలసీలున్నాయంటే.. ఈ ప్రాంతవాసులు ఎంతలా మునిగిపోయారో తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోనే ఆరుగురు అగ్రిగోల్డ్‌ బాధితులు మానసిక క్షోభతో మరణించారని తెలిసి చాలా బాధేసింది. బాబుగారు చెప్పుచేతల్లో ఉండి ఆడమన్నట్టు ఆడిన దర్యాప్తు సంస్థ.. అగ్రిగోల్డ్‌ సంస్థల్లో అత్యంత విలువైనది, కీలకమైనది అయిన హాయ్‌ల్యాండ్‌ ఎండీని అరెస్ట్‌ చేయకపోవడం దారుణం. అగ్రిగోల్డ్‌కు హాయ్‌ల్యాండ్‌ అనే ఆస్తే లేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. 

సీఐడీ వారికి బాబుగారిపై ఉన్న అపారమైన స్వామి భక్తిని ఇది తెలియజేస్తోంది. ఆ సంస్థ ఆస్తులను దోచుకునే పథకంలోని కుట్రను బహిర్గతం చేస్తోంది. ‘ఇలాంటి దర్యాప్తు సంస్థలతో మా లాంటి బాధితులకు న్యాయమెలా జరుగుతుంది’ అంటూ అగ్రిగోల్డ్‌ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. నిజంగా చాలా బాధేసింది. అగ్రిగోల్డ్‌ నుంచి పోలవరం దాకా, ఓటుకు కోట్లు నుంచి నాపై జరిగిన హత్యాయత్నం వరకూ జరిగిన కుంభకోణాలు, కుట్రలు.. ఆటవిక పాలనకు అద్దంపడుతున్నాయి. రాజ్యాంగాన్ని అపహాస్యంచేసి ఎమ్మెల్యేలను పశువుల్లా కొని.. అనర్హత వేటు పడకుండా కాపాడి.. మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేయించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాయి.   

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీపై వచ్చిన ఏ ఆరోపణలపైనైనా మీ ఆధీనంలో లేని ఏ స్వతంత్ర సంస్థతోనైనా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించడానికి వెనకడుగు వేస్తున్నారెందుకు? మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీపై న్యాయ విచారణ జరగకుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం.. మీపై విచారణ జరగకుండా దర్యాప్తు సంస్థలను నిషేధించడం వంటి చర్యలతో మీకు మీరే దోషులుగా తేటతెల్లం చేసుకోవడం వాస్తవం కాదా?  
-వైఎస్‌ జగన్‌ 


Back to Top