మాకేది స్వాతంత్య్రం?

ఆంధ్ర రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై అరాచ‌కాలు
అధికార పార్టీ అండ‌తో అబ‌ల‌ల‌పై అఘాయిత్యాలు
మాయ‌ని మ‌చ్చ‌గా రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌, కాల్‌మ‌నీ సెక్స్‌రాకెట్‌, వ‌న‌జాక్షి ఘ‌ట‌న‌లు
అన్యాయాల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నిరంత‌ర పోరాటం

`` ఆడ‌వాళ్లు అర్ధ‌రాత్రి ఒంట‌రిగా తిరిగిన‌ప్పుడే నిజ‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ట్లు`` అని మ‌హాత్మా గాంధీ చెప్పిన మాట‌లనే స్ఫూర్తిగా తీసుకుంటే  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇంకా స్వాతంత్ర్యం రాలేద‌నే చెప్పాలి. రాత్రిపూట దేవుడెరుగు.. ప‌గ‌లే న‌డిరోడ్డుపై వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌హిళ‌ల మాన‌..ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేక‌పోవ‌డంతో ఆడ‌పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపించాలంటే త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డిపోతున్నారు. లైంగిక దాడులు..అత్యాచారాలు.. భౌతిక దాడుల‌కు దిగుతున్న అరాచ‌క శ‌క్తుల‌ను స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా స‌ర్కార్ పెద్ద‌లు వారిని ద‌గ్గ‌రుండి ర‌క్షిస్తున్నారు. వీట‌న్నింటి చూస్తుంటే ఏపీలో మ‌హిళ‌ల‌కు ఇంకా స్వాతంత్ర్యం రాలేద‌నే చెప్పొచ్చు.

మాతృదేవో భవ అనే సనాతన ధర్మానికి నెలవు మన భారతదేశం. పరాయి స్త్రీని కూడా మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతి మ‌న‌ది. ఇలాంటి భరతభూమిపై నేడు మహిళల మాన, ప్రాణాలకు భద్రత కరువైంది..మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యాకృత్య‌మయ్యాయి. నాడు తెల్ల దొర‌ల పైన పోరాటం చేసిన స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రంలో  జ‌రుగుతున్న అరాచ‌కాల‌పైన మ‌రో స్వాతంత్ర్య పోరాటం చేయ‌క‌త‌ప్ప‌డం లేదు. స్వాతంత్ర్యం వ‌చ్చి నేటికి 70 ఏళ్లు కావ‌స్తున్న త‌రుణంలో ఆంధ్ర రాష్ట్రంలో అధికార తెలుగు దేశం పార్టీ నేత‌లు రెండేళ్ల‌లో చేసిన అర‌చ‌కాల‌పై ప్ర‌త్యేక క‌థ‌నం..
రిషితేశ్వ‌రి మ‌ర‌ణం జాతికే మ‌చ్చ‌!
 “ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత...పోతే ఎంత” అన్న ఓ సినిమాలోని డైలాగు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు క‌రెక్టుగా స‌రిపోతుంది. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ విద్యార్థుల దాష్టీకానికి బ‌లైన‌ జూనియ‌ర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణం జాతికే ఓ మ‌చ్చ‌లా మిగిలిపోయింది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఈ ముఖ్యమంత్రి ఇంత వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు రిషితేశ్వ‌రిని ర్యాగింగ్ చేశారు. ఈ అవమానాన్ని భ‌రించ‌లేక  ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ చేసే విద్యార్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అండగా ఉన్నాడ‌ని స్ప‌ష్ట‌మైంది. వారితోనే తాగి తందనాలు ఆడుతాడని వీడియో సాక్ష్యాలతో సహా బయటపడింది. ఆ ప్రిన్సిపాల్ కు టీడీపీ నేత‌లు అండ‌గా నిల‌బ‌డ‌టంతో ఆయ‌న్ను ఏమీ చేయ‌లేక‌పోయారు. ఈ కేసులో అరెస్టయిన శ్రీనివాస్, అనిషా అనే విద్యార్థులతో పాటు, శ్రీచరణ్ అనే లెక్చరర్ వ్యవహారం ఎటూ తేలలేదు. రిషితేశ్వరి ఆత్మహత్యకు బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపల్ ను  ప్ర‌భుత్వం వెనకేసుకు వస్తున్న తీరు చూసిన తరువాత ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డల రక్షణ విషయంలో భరోసా ఉంటుంది?
కాల్‌మ‌నీ..ఓ పీడ క‌ల‌
న‌వ్యాంధ్ర రాజ‌ధాని విజ‌య‌వాడ నడిబొడ్డున వెలుగు చూసిన కాల్ మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఓ పీడ క‌ల‌గా మిగిలిపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు కొలువు తీరిన విజయవాడ సభ్య సమాజం మొత్తంగా తలదించుకునేలా హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారింది. కాల్ మనీ పేరిట పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టారు. కనీ వినీ ఎరుగని వడ్డీ సమర్పించుకోలేని కుటుంబాల్లో స్త్రీలను, యువతను చెరపడుతున్నారని వార్తలు, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దుర్మార్గానికి, అరాచకానికి.. రాక్షసత్వానికి మించిన హీన స్వభావానికి, మాటలకు అందని నీచ గుణానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో, బాధ్యులు ఎవరో అందరికీ తెలుసు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ వ్యవహారంలో తెర వెనక ఉండి.. ఈ కాల్ మనీ కమ్ సెక్స్ మాఫియా వారితో పడుగూ పేకల్లా కలగలిసిపోయారు. వారి సొమ్ములతో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు, తోరణాలు వెలవటంతో మొదలుపెట్టి.. టీడీపీ శాసన సభ్యుల్ని విదేశీ విహారాలు చేయించే వరకు ఈ కాల్ మనీ రావణాసురులే స్పాన్సర్లుగా ఉన్నారన్న పచ్చి నిజం తెలుగు ప్రజల గుండెల్ని నిప్పులా దహిస్తోంది. చీటికీ, మాటికీ ప్రెస్ మీట్లు పెట్టి చిన్నా చితకా అంశాలమీద కూడా అనర్గళంగా అబద్ధాల ప్రసంగాలు చేసే చంద్ర‌బాబు కొత్త రాజధాని పరిధిలో వేల మంది స్త్రీలను టీడీపీ రావణ, దుర్యోధన, దుశ్శాసన సంతతి నెలల తరబడి చెరపడుతున్న విషయం బట్టబయలు అవుతున్నా నోరు మెదప‌లేదు. చట్టం దన్నుగా ప్రజలను కాపాడాలని, ఈ రాక్షస సంతతిని వేరు మూలాలతో తుద ముట్టించాలని బాబుకు ఏనాడు అనిపించ‌లేదు. ఈ సిగ్గు మాలిన రాక్షసకాండ నుంచి వారిని ఎలా తప్పించాలా అన్న ఆలోచనతో, మిగతా రాజకీయ పార్టీల వారు ఈ కాల్ మనీ వ్యవహారంలో ఉన్నారని కేసులు పెట్టాల్సిందిగా సీఎం త‌న అనుచరులకు ఆదేశాలిచ్చారు. తెలుగు దేశం పార్టీ వారు ఎంతటి ఘోరాలూ, నేరాలూ చేసినా చట్టానికి దొరక్కుండా కాపాడుకుంటారన్న చంద్ర‌బాబు స్వభావం,  ప్రభుత్వ వ్యవహారం ప్రజలకు బాగా అర్థం అయింది. 
మ‌హిళా అధికారిణిపై జులూం
ఇసుక అక్ర‌మ ర‌వాణ‌కు అడ్డువ‌చ్చింద‌న్న కార‌ణంగా మ‌హిళా అధికారిణిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడికి పాల్ప‌డి జాతికి క‌ళంకం తెచ్చారు. కృష్ణా జిల్లా ముసునూరు త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షీని త‌మ అక్ర‌మ ఇసుక రవాణాను అడ్డుకుంద‌న్న నెపంతో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెంద‌లూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ జుట్టు పట్టుకు ఈడ్చారు. స‌ద‌రు ఎమ్మెల్యే అటవీ అధికారులమీద దాడి చేసి కొల్లేరులో సొంత రోడ్డు వేసుకున్నారు. అంగన్ వాడీలను సభ్యసమాజం రాయలేని, వినలేని భాషలో అన్యాయంగా దుర్భాషలాడిన చింతమనేని ప్రభాకర్ మీద కేసులు లేకుండా చేయటమే కాకుండా, బిరుదు సత్కారాలు చేసి.. రాష్ట్రంలోనే పనితీరులో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా సన్మానిస్తుంటే ఈ రాక్షస రాజ్యంలో పోలీసులకు తమ గోడు చెప్పుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది? వనజాక్షిని చంద్ర‌బాబు త‌న‌ ఇంటికి పిలిచి బెదిరించిన నేపథ్యంలో టీడీపీ నాయకుల రాక్షస కృత్యాలను అడ్డుకునే సాహసం ఏ రెవెన్యూ అధికారికి ఉంటుంది?   
ఆయ‌నంతే..చెబితే చేయ‌రు
అధికారంలోకి వస్తే మహిళలందరికీ అభయం ఇస్తానని, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుందని, ఫోన్ చేసిన అయిదు నిమిషాలలోనే పోలీసులు వచ్చి వాలతారని ఎన్నికల సమయంలో చంద్ర‌బాబు ప్రకటనలు గుప్పించారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సెక్స్ మాఫియా, మనీ మాఫియా.. ఒక్కటని ఏముంది? విజయవాడను బాబు ఆధ్వర్యంలో వంద రకాల మాఫియాలకు రాజధానిగా తయారు చేసి పెంచి పోషిస్తున్న వైనం సామాజికంగా, విలువల పరంగా మీరు ఇంకా దిగజారటానికి మరేమీ లేదన్న భావన కలిగిస్తోంది. సెక్స్ రాకెట్‌తో సహా ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా తమను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అండగా ఉంటారన్న భరోసా కొందరు అధికార పార్టీ నేతలలో బలంగా ఉండడం వల్లే  విజయవాడ నేరాల నగరంగా మారిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యేకి సీఎం కొమ్ము కాసి ఆ అధికారినిదే తప్పు అన్నట్టు వ్యవహరించారు. అప్పుడే చింతమనేనిని కంట్రోలు చేసి ఉంటే విజయవాడలో మరొక అధికార పార్టీ ఎమ్మెల్యే సెక్స్ రాకెట్ వంటి తప్పుడు వ్యవహారాలకు పాల్పడి ఉండే వారు కాదు.  
మ‌హిళ‌ల‌కు అండ‌గా ప్ర‌తిప‌క్షం
రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న అధికార పార్టీ నేత‌ల‌పై ఎలాంటి కేసులు న‌మోదు కావ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చ‌ట్ట‌స‌భ‌ల్లో, బ‌య‌ట ఉద్య‌మిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ‌ప‌డుచుల‌కు తోడుగా నిలిచింది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్లుగా మ‌హిళ‌ల‌కు తోడుగా నిలుస్తున్నారు. రిషిత్వేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న త‌రువాత రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టారు. అసెంబ్లీలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ వ్య‌వ‌హారంలో ఇటు బ‌య‌ట‌, అటు చ‌ట్ట స‌భ‌ల్లో స‌ర్కార్‌పై పోరాటం చేయ‌గా..ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు. అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఇలాంటి ఘోరం ఎప్పుడు చోటు చేసుకోలేదు. సామ‌న్య మ‌హిళ నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు అన్యాయం చేస్తున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌పై మ‌రో స్వాతంత్ర్య పోరాటం చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌కారం అందిస్తే..నాడు బ్ర‌టిష్ పాల‌కుల‌ను త‌రిమిన‌ట్లుగా..తెలుగు దేశం పార్టీ నేత‌ల అరాచ‌కాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే వీలుంటుంది. 
Back to Top