కాంగ్రెస్‌తో మీది ఏ డీల్‌ చంద్రబాబూ?

శ్రీకాకుళం, 16 సెప్టెంబర్ 2013:

చంద్రబాబుకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే ఉందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.  కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై ఆఖరికి విభజనకు కూడా మద్దతు పలుకుతున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ డీల్‌ ‌కుదిరిందని చేస్తున్న ఆరోపణలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజంగానే డీల్‌ పెట్టుకుంటే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారు జైలులో ఉండేవారా? అని ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డీల్‌ పెట్టుకుని ఉంటే.. ఈ పాటికి జగన్మోహన్‌రెడ్డిగారు కూడా చిరంజీవిలా ఏ కేంద్ర మంత్రో అయిపోయేవారు కాదా.. ఏ ముఖ్యమంత్రో అయ్యేవారు కాదా? అన్నారు. నేరం రుజువు కాకుండానే జగన్మోహన్‌రెడ్డిగారు 16 నెలలుగా జైలులో ఉన్నారంటే.. ఎవరు ఎవరితో కుమ్మక్కైనట్టు? ఎవరితో ఎవరు డీల్‌ పెట్టుకున్నట్టు? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబుకు అర్థం కావడంలేదా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సోమవారం రాత్రి నిర్వహించిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర ముగింపు సభలో శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ను నాలుగైదు లక్షల కోట్లుకు బేరం పెట్టేశారంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడా? లేక దుర్మార్గుడనాలా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటే ఉంటే కాంగ్రెస్, టిడిపిలకు మనుగడ ఉండదని ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని, కుట్రలు పన్ని కుమ్మక్కై, కేసులు పెట్టి ఆయనను అన్యాయంగా జైలు పాలు చేశాయని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఎవరు ఎవరితో కుమ్మక్కైనట్టు? మీరు కాదా చంద్రబాబు గారూ కాంగ్రెస్‌తో డీల్‌ పెట్టుకున్నదని నిలదీశారు.

ఎఫ్‌డిఐ విషయంలో టిడిపి రాజ్యసభ సభ్యులను సభ నుంచి గైర్హాజరు చేసి ఏ డీల్‌ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి సహాయపడ్డారని చంద్రబాబును శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో కలవక ముందు కాకుండా దానిలో కలిసిన తరువాత ఏ డీల్‌ కుదుర్చుకుని అవిశ్వాసం పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోదని నమ్మకం కుదిరిన తరువాత అవిశ్వాసం పెట్టడానికి ఏ డీల్‌ చేసుకున్నారన్నారు. అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాసం పెడితే ఏ డీల్‌ చేసుకుని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోకుండా నిస్సిగ్గుగా కాపాడారని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల నుంచి తాజా ఎన్నికల వరకూ కాంగ్రెస్‌తో పాలు నీళ్ళులా కలిసిపోయి పనిచేసింది ఎవరు? చంద్రబాబూ మీరు కాదా అని నిలదీశారు. ఏ డీల్‌ ప్రకారం మీమీద సిబిఐ, ఈడీ విచారణ, దర్యాప్తులు జరగకుండా చూసుకుంటున్నారని తూర్పారపట్టారు. హైదరాబాద్‌ నడిబొడ్డులోని 850 ఎకరాలను మీ బినామీ కంపెనీకి అప్పనంగా ఇచ్చేస్తే.. విచారణ చేయడానికి తన దగ్గర సిబ్బంది లేదని సిబిఐ ఏ డీల్‌ ప్రకారం పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మార్‌ కేసులో 550 ఎకరాలను మీరు మీ వాళ్ళకు ఇచ్చేసుకుంటే.. మిగతా అందరి మీదా కేసులు పెడుతుంది.. జైలులో పెడుతుంది గానీ మిమ్మల్ని కనీసం విచారణకు కూడా పిలవడం లేదంటే.. మీరు కాదా చంద్రబాబు గారూ డీల్‌ పెట్టుకుంది అన్నారు.

'మీ ఆస్తులు రూ. 40 లక్షలని, మీ కుటుంబం ఆస్తులు రూ. 41 కోట్లని ఈ రోజు మీరు ప్రకటించారట. చాలా ధర్మంగా మీరు ఆస్తులు సంపాదించారని కూడా అన్నారట. ఒకే ఒక్క మాట అడుగుతున్నాం చంద్రబాబుగారూ. నిజంగానే మీలో అవినీతి లేకపోతే.. మీ ఆస్తులన్నీ అంత ధర్మంగా సంపాదించి ఉంటే.. ఎలాగూ మీరు ఢిల్లీకి వెళుతున్నారు కదా.. ప్రధాని, రాష్ట్రపతికి ఐఎంజి, ఎమ్మార్‌ కేసులలో మీ మీద ఉన్న అన్ని అవినీతి కేసులపైనా విచారణ చేయించండి అని లేఖలు ఇచ్చే ధైర్యం మీకుందా చంద్రబాబు గారూ..' అన్నారు.

ఏ డీల్‌ కోసమని చిదంబరాన్ని, భరద్వాజ్‌ను ఇంకా కలుస్తూనే ఉన్నారని చంద్రబాబును శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. పాపం.. రాజశేఖరరెడ్డిగారు చనిపోయారన్న ఇంగితం కూడా లేకుండా ఏ డీల్‌ ప్రకారం ఆయన మీద లక్ష కోట్లని ఆరోపణలు మొదలుపెట్టి.. కాంగ్రెస్ కలిసి ఆయన కొడుకు మీద ఎందుకు కేసులు పెట్టారని నిలదీశారు.‌ కాంగ్రెస్‌తో కలిసి కుట్రలు చేసి శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారికి 16 నెలలుగా బెయిల్‌ రాకుండా చేస్తున్నది ఏ డీల్‌ చేసుకుని అని అన్నారు.‌ సీమ గడ్డ మీద పుట్టి కూడా ఏ డీల్ ప్రకారం సీమాంధ్రులకు ఇంత అన్యాయం చేస్తున్నారు చంద్రబాబూ అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా మీరు ఇచ్చిన లేఖను ఏ డీల్‌ ప్రకారం వెనక్కి తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ఏ డీల్‌ కోసం మీ ఎంపీలను ఢిల్లీకి పంపారని.. ఇప్పుడు ఏ డీల్‌ కోసమని మీరు ఢిల్లీకి వెళుతున్నారని చంద్రబాబును శ్రీమతి షర్మిల తూర్పారపట్టారు. దమ్ముంటే సమాధానం చెప్పండి చంద్రబాబుగారు అని సవాల్‌ చేశారు.

ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షంతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేయగలరని, బిజెపితో ఎప్పుడూ పొత్తు పెట్టుకోను అని 200లో చెప్పినా 2014 వచ్చే సరికి దానితోనే పొత్తు కూడా పెట్టుకోగలరని ఆరోపించారు. మీ బుద్ధి గురించి ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు చంద్రబాబుగారు అన్నారు.
తాను చేసిన అన్యాయం అంతా చేసి ఈ విభజనకు కారణం రాజశేఖరరెడ్డిగారు అని చంద్రబాబు చెప్పడంపై శ్రీమతి షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ బ్రతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని సాక్షాత్తూ ప్రధాన మంత్రి, కోట్లాది మంది ప్రజలు చెబుతున్నారన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరైతే.. కారణం రాజశేఖరరెడ్డిగారు ఎలా అవుతారని ప్రశ్నించారు. అంటే మీకు మనస్సాక్షి లేదనుకోవాలా? లేక మీ శరీరంలో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన ప్రకటనతో కోట్లాది మంది తెలుగువారి గుండెలు రగిలిపోతుంటే.. కాంగ్రెస్‌ నాయకులు చర్చల పేరుతో రోజుకు ఒకరి ఇంట్లో సమావేశమై విందులు చేసుకుంటున్నారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకూడదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొట్టమొదటి నుంచీ ఒకే మాట చెప్పిందన్నారు. మీ ఆలోచనా విధానం ఎలా ఉందో.. మీ ఉద్దేశం ఏమిటో.. అందర్నీ పిలిచి చర్చించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పదే పదే చెబుతూనే ఉందని శ్రీమతి షర్మిల తెలిపారు. కాని ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా మరిచిపోయి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిందని ఆమె దుయ్యబట్టారు. న్యాయం చేయకపోతే.. న్యాయం చేసే సత్తా లేకపోతే విభజించే హక్కు మీకెక్కడిదని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. న్యాయం చేయడం మీ ఉద్దేశం కాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని యధాతథంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకి చేతకాదని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అన్నారు.

జగనన్న 16 నెలలుగా నిర్బంధంలో అన్యాయంగా నలిగిపోతూ కూడా, తన కష్టాన్ని పక్కన పెట్టి.. కోట్ల మంది ప్రజలకు వచ్చిన కష్టానికి చలించిపోయి తన వంతుగా జైలులోనే ఏడు రోజులు కఠోర నిరవధిక నిరాహార దీక్ష చేశారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. జగనంలో ఉన్నా, జైలులో ఉన్నా జగనన్న జననేతే అని గర్వంగా చెప్పుకోగలం అన్నారు. బయటే ఉన్నా టిడిపి నాయకులు దొంగలు, ద్రోహులే అని దుమ్మెత్తిపోశారు.

కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని శ్రీమతి షర్మిల తెలిపారు. జగనన్న నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరఫున నిలబడి న్యాయం కోసం ఎందాకైనా పోరాటం చేస్తుందని ఆమె మాట ఇచ్చారు. విలువలతో కూడాన రాజకీయాలు చేసే దమ్మూ ధైర్యం లేని కాంగ్రెస్, టిడిపి నాయకులు కుట్రలు చేసి అబద్ధపు కేసులు పెట్టి జగన్నను జైలుపాలు చేశారని అన్నారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఆపలేనట్లే జగనన్నను కూడా ఎవరూ ఆపలేరన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారని తెలిపారు. ఆ రోజు వచ్చేంత వరకూ ప్రజలంతా జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మి విజ్ఞప్తిచేశారు.

Back to Top